మార్చి2026 నెలలో 64kalalu.com వెబ్ పత్రికలో నేను వ్రాసిన "బహుమతుల కాకి" పుస్తక సమీక్ష
విలువలు – విజ్ఞానం – వినోదం కలగలిపిన బాలసాహిత్య రత్నం “బహుమతుల కాకి” కథా సంపుటి.
నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లల దృష్టి ఎక్కువగా తెరలపైనే కేంద్రీకృతమవుతున్నది. అలాంటి ఈ కాలంలో, మంచి పుస్తకం చేతిలో పడితే వారి ఊహాశక్తి, ఆలోచనా ధోరణి, భావోద్వేగాలు, పిల్లల సున్నితత్వం మరింత వికసిస్తాయి. అలాంటి పఠనానుభూతిని అందించే బాలల కథాసంపుటి “బహుమతుల కాకి”. నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న విజ్ఞాన ప్రచురణల వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. బాలల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్న కథా రచయిత “టి.వి. రామకృష్ణ గారు” ఈ సంకలనంలో మొత్తం 15 కథలను అందించారు. డిసెంబర్ 2025లో తొలి ముద్రణగా 1000 ప్రతులు వెలువడటం ఈ పుస్తకంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.
ఈ కథాసంపుటి ప్రత్యేకత ఏమిటంటే – ప్రతి కథలో వినోదం వెనుక ఒక విలువ దాగి ఉంటుంది; ప్రతి సంఘటన వెనుక ఒక జీవనపాఠం నిలుస్తుంది. ఉపదేశాత్మక ధోరణి కాకుండా, అనుభూతి ద్వారా పిల్లలకు సందేశాన్ని అందించడం అనేది ఈ రచయిత నైపుణ్యం.
ప్రకృతి – స్నేహం – మనసుల మమకారం
“బహుమతుల కాకి” అనే తొలి కథలో చిన్నారి మేఘన మరియు ఒక కాకి మధ్య ఏర్పడిన అమాయక స్నేహాన్ని హృద్యంగా ఆవిష్కరింపజేశారు. ప్రకృతితో మమేకమవడం, జీవరాశుల పట్ల కరుణ చూపడం, నిరీక్షణలోని ప్రేమ – ఇవన్నీ కథలో సహజంగా అనిపిస్తాయి. పిల్లలు చదివేటప్పుడు తాము కూడా ఆ చెట్టు క్రింద కూర్చున్నట్టుగా అనుభూతి చెందుతారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
“అభయ్ ఆలోచన”, “మధులిక పుట్టినరోజు” వంటి కథలు ప్రకృతి, పల్లె జీవన వాతావరణం, జంతు–పక్షుల ప్రపంచం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి. ఈ కథలు పిల్లలలో పరిశీలనా దృష్టిని పెంచుతాయి.
విజ్ఞాన ప్రేరణ – సృజనాత్మక దిశ
“ఆకాశంలో పక్షులు – జంతువులు” కథ ఖగోళ విజ్ఞానంపై ఆసక్తిని కలిగిస్తుంది. తాతయ్య ఇచ్చిన టెలిస్కోప్ ఒక సాధారణ బహుమతి మాత్రమే కాదు – అది చిన్నారులలో జ్ఞానాన్వేషణకు పునాది వేస్తుంది.
“కృత్రిమ మేధా” కథలో భవిష్యత్ విద్యావిధానాల రూపురేఖలను రచయిత చక్కగా ఊహించారు. ఇందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు భయపెట్టే విధంగా కాకుండా, నేర్చుకోవడానికి ఉపకరించే సాధనంగా చూపించడం ప్రశంసనీయం.
ధైర్యం – వ్యక్తిత్వ వికాసం
“పప్పు సాహసం” కథ స్నేహం, ధైర్యం, సమయస్ఫూర్తి విలువలను బలంగా ప్రతిపాదిస్తుంది.
“మార్పు కోరిన కాలుడు” కథ ఇతరులను అనుకరించాలనే కోరిక వెనుక ఉన్న అపోహలను చెదరగొట్టి, స్వీయ సామర్థ్యాన్ని గుర్తించుకోవాలని సూచిస్తుంది.
“విరబూసిన బంతి చెట్టు” కథలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించేందుకు రచయిత ప్రయత్నించారు. శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ అభిప్రాయాన్ని కథలో సున్నితంగా మేళవించి చెప్పడం చాలా బాగా అనిపించింది.
చరిత్ర – సంస్కృతి – కుటుంబ విలువలు
“దుర్గాబాయి” కథ ద్వారా దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవిత స్ఫూర్తిని పరిచయం చేశారు. చిన్నారులకి చరిత్రను భారంగా కాకుండా ప్రేరణాత్మకంగా అందించడం అభినందనీయం.
“క్షీరసాగర మథనం” కథ పురాణ గాథను బాలల భాషలో సరళంగా వివరిస్తుంది.
“చంటిగాడు” కథ కుటుంబ జీవనంలోని అల్లరిని, అనుబంధాన్ని ముద్దుగా చూపిస్తుంది.
రూపకల్పన ప్రత్యేకత
ఈ పుస్తకంలోని ప్రతి కథకు జతచేసిన ఆకర్షణీయమైన ఏఐ చిత్రాలు కథానుభూతిని మరింత సజీవంగా మారుస్తాయి. చిత్రాలు పిల్లల ఊహాశక్తిని విస్తరింపజేస్తాయి. భాష సరళంగానూ, వాక్య నిర్మాణం సూటిగా సులభ గ్రాహ్యంగానూ ఉన్నది. మంచి చక్కటి పిల్లలకు ఆకషణీయమైన రీతిలో చక్కటి ముఖచిత్రాన్ని కూడా అందించారు. రంగు కూడా ప్రకృతిని సూచించేలా ఉన్నది.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, “బహుమతుల కాకి” కేవలం కథల సంకలనం కాదు; అది పిల్లల మనసుల్లో విలువల విత్తనాలు నాటే పుస్తకం. ప్రకృతి ప్రేమ, విజ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబ అనుబంధం – ఇవన్నీ ఒకే గ్రంథంలో సమన్వయమై ఉండటం ఇందులోని విశేషం.
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పఠనానుభూతి అందించాలనుకుంటే, ఉపాధ్యాయులు తమ పిల్లలను మంచి విజ్ఞానదాయకులుగా రూపుదిద్దాలనుక్కున్నా.. గ్రంథాలయంలో చేర్చదగిన మంచి పుస్తకం కోసం వెతుకుతుంటే – “బహుమతుల కాకి” సరైన ఎంపిక.
ఈ పుస్తకం ధర కేవలము రూ.120/- మాత్రమే. పుస్తకాన్ని పొందదలచిన వారు సంప్రదించవలసిన చిరునామా: జి. మాల్యాద్రి
విజ్ఞాన ప్రచురణలు,
ప్రజా సైన్స్ వేదిక ప్రచురణల విభాగం
162, విజయలక్ష్మీ నగర్, నెల్లూరు – 524004
సెల్: 9440503061
చిన్నారుల చేతిలో మంచి పుస్తకం ఉంటే – వారి భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుంది. ఆ ప్రకాశానికి ఒక చిన్న దీప్తి “బహుమతుల కాకి”.
……………….
సమీక్ష : “నవ్యకవితాకళానిధి” మద్దిరాల శ్రీనివాసులు
ఉపాధ్యాయుడు, రచయిత (cell:9010619066)