PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



పుస్తక సమీక్షలు

తేది:05-10-2022, "నేటి నిజం" దినపత్రికలో.... ప్రచురించబడిన నా పుస్తక సమీక్ష  
తేది:05-10-2022, "భూమిపుత్ర " దినపత్రికలో.... ప్రచురించబడిన నా పుస్తక సమీక్ష  




తేది:19-09-2022, దిశ దినపత్రికలో.... ప్రచురించబడిన నా పుస్తక సమీక్ష 


ఈ పుస్తకము యొక్క సమీక్షను.... ఈ లింక్ ద్వారా pustakam.net లో చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి.  
నేటి విద్యార్థులు,ఉపాధ్యాయులకు ఆదర్శం - హెలెన్ కెల్లర్ జీవిత గాథ
             -మద్దిరాల శ్రీనివాసులు, టీచర్,      
రచయిత్రి డాక్టర్ నన్నపనేని మంగాదేవి గారు ఒక అద్భుతమైన వ్యక్తి అయిన హెలెన్ కెల్లర్ జీవిత గాథను గ్రంథస్తం చేసి మంచి పని చేశారు. ముందుగా ఆమెకు కృతజ్ఞతలు.
            ఇందులో హెలెన్ అనే ఒక అమ్మాయి తన రెండేళ్ళ వయసులో ప్రమాద వశాత్తు తన చూపు, వినికిడి రెండూ పోగొట్టుకుంటుంది. అయితే పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం వీటన్నిటితో డిగ్రీ పట్టా పొందడమే గాక , ఒక రచయిత్రిగా కూడా ఎదిగిన వైనం నేటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తివంతం. అంగవికలుర పట్ల సమాజం చూపించవలసింది జాలి కాదు, వారికి జీవితంలో బ్రతకడానికి కావలసిన స్థైర్యం,ధైర్యం ఇస్తే వారి లోపాలను సైతం లెక్క చేయకుండా ఎంతటి వున్నత స్థానానికైనా ఎదుగుతారు అని చెప్పడానికి ఓ చక్కని నిరూపణ హెలెన్ జీవితం. అలాగే  హెలెన్ చిన్నతనంలో బాగా అల్లరి చేసేదట. అపుడు తల్లిదండ్రులు  తనకు చదువు నేర్పడానికి సలీవాన్ అనే ఆమెను ఏర్పాటు చేస్తారు. పాక్షిక చూపు మాత్రమే కలిగి వినికిడి, మాట కూడా లేని ఆమె ఎంతో ఓపికగా హెలెన్ కు విద్య నేర్పడం ఒక అద్భుతం. సలీవాన్ బోధనా జీవితం నేటి కాలంలోని ప్రతి ఉపాధ్యాయునికి ఆదర్శవంతమైనది.  
ఇందులో సుజాత అనే అమ్మాయి హెలెన్ కెల్లర్ గురించి తెలుసుకోవడానికి తనదైన శైలిలో ఇంట్లో అన్న ద్వారా, బడిలో ఉపాధ్యాయుని ద్వారా హెలెన్ గురించి సమాచార సేకరణ చేస్తుంది. అంతే కాదు, తాను ఎంతో తెలివిగా , చక్కగా మాట్లాడి ఉపాధ్యాయురాలి ద్వారా తనకు కావలసిన చోట పిక్నిక్ ఏర్పాటు చేయుంచుకుంటుంది. ఈ పాత్ర ద్వారా విద్యార్థులంటే ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి కృషి చేయాలని, సంపూర్ణ విషయ సాధనకి విద్యార్థులు ఆసక్తి, పట్టుదల, సమయస్ఫూర్తి కలిగి విషయ సేకరణ స్వభావం తో ఎవరితో ఎలా నడచుకోవాలో తెలిపారు రచయిత్రి. ఒక్క మాటలో చెప్పాలంటే  హెలెన్ గాథకు తగిన విధంగా నాటకీకరణ పాత్రలను, కథను చిత్రీకరించిన మంగాదేవి గారి సృష్టి అనిర్వచనీయం. సుజాత పాత్ర నేటి విద్యార్థులకు ఆదర్శం.

 హెలెన్ గాథను నాటకీకరణ ద్వారా సంభాషణ రూపంలో అందించడం నాకు చాలా బాగా నచ్చింది. పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఎప్పుడూ తరగతి గదిలోనే కాకుండా బయటి వాతావరణం, విషయాలు తెలుపవలసిన అవసరం ఎంతైనా వుందని తెలుపడమే కాకుండా, అంధుల లిపిని కూడా  పరిచయం చేయడం చాలా చాలా హైలెట్. 

మొత్తంపై ఈ పుస్తకం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక వ్యక్తి, చదువదగినదే. అయితే రఘురామయ్య అనే తండ్రి పాత్ర డిక్టేటర్ అయ్యింది. మొదట్లో అలా వుంచినా చివరికి  పిల్లల నడవడిక ద్వారా తండ్రిలో మార్పు వచ్చేలా మలచి, తనతో కూడా హెలెన్  గురించి మాట్లాడించడమో, మంచిపని చేసేటపుడు భయపడవలసిన పని లేదనే సందేశం ఇప్పించడమో చేసి వుంటే బాగుండేది . పుస్తకం చూడడానికి చిన్నదిగా కనిపించినా క్వాలిటీపరంగా, పుస్తకం లోని విజ్ఞాన విలువ పరంగా చూస్తే రూ. 30.00  లు అనేది చాలా తక్కువ ఖరీదు. అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్ ల లోనూ లభ్యమవుతుంది.  పూర్తి వివరాలకు visalaandhraph@yahoo.com అనే ఈమెయుల్ మరియు అనే www.visalaandhraph.net వెబ్ సైట్ లోనూ సంప్రదించవచ్చును. 


  గిజూభాయి గారి " పగటికల " పై నా సమీక్ష  ఈ పుస్తకము యొక్క సమీక్షను.... ఈ లింక్ ద్వారా pustakam.net లో చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి.

"పగటి కల" కాదిది సాధించగల " నిజమైన కల"  ........ మద్దిరాల శ్రీనివాసులు, సెల్ : 9010619066 

 ఒక మూస పధ్ధతిలో పాఠశాలల్లోని విద్యార్థులకు బట్టీ పద్ధతుల ద్వారా విద్యను నేర్పించడం, మూల్యాంకన విధానం , వార్షికోత్సవం జరిపే విధానం, మొ|| వాటిని నిరసిస్తూ, ఎలాంటి దండన, శిక్షలు లేకుండా దాదాపు డెభ్బై సంవత్సరాల క్రితం గిజూభాయి అనే ఒక విద్యావేత్త ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆట, పాటలతో ఆసక్తికరంగా ఎలా బోధించవచ్చు ? మూల్యాంకన విధానం ఎలా వుండాలి ? వార్షికోత్సవం అంటే ఏమిటి ? అనే విషయాలను తాను ప్రత్యేకమైన పధ్ధతులతో ఒక పుస్తకం వ్రాసుకుంటారు. వాటిని తన ప్రయోగాల ద్వారా ప్రత్యక్ష పధ్ధతిలో బోధించి నిరూపించి అధికారుల ప్రశంసలు సాధించిన విధానంతో కూడిన ఒక అద్భుతమైన పుస్తకమే ఈ " పగటికల".
    ఈ విద్యావేత్త తాను వ్రాసిన పుస్తకంలోని బోధనా పద్ధతులను విద్యార్థులలో ప్రయోగించడానికి ఒక పాఠశాలలోని నాలుగవ తరగతి విద్యార్థులను ఒక ఉన్నత విద్యాధికారి గారి అనుమతితో సంవత్సరం పాటు దత్తత తీసుకుంటారు.  తన నూతన ప్రయోగ పద్ధతుల ద్వారా ఇతర తరగతుల విద్యార్థులతో సమానంగా దండన, శిక్షలు లేకుండా ఆ విద్యాసంవత్సరం చివరి నాటికి చక్కగా తీర్చి దిద్దుతాననే ఒప్పందంతో ఆ తరగతికి సంబంధించిన పుస్తకాలు, సిలబస్, నియమాలు మొ||నవి తీసుకుంటారు. అయితే, తదుపరి తాను తీసుకున్న తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు, సిలబస్ లనన్నింటినీ పక్కకు పెట్టి తాను వ్రాసుకున్న పద్ధతులతో,
    మొదటి రోజు పాఠశాల ప్రారంభం కాకముందే అక్కడికి ఎంతో ఉత్సాహంతో చేరుకుంటారు. తరగతిలో విద్యార్థులకు తన పద్ధతులతో ఎంతో చక్కగా బోధించవచ్చన్న ఆశతో అడుగు పెట్టిన తనకు అక్కడి పిల్లలను సముదాయించడమే చేతకాదు. ఆ పిల్లలు సరిగా గుండీలు లేని చెదిరిపోయిన బట్టలతో, ఎన్నాళ్ళ నుండో తైల సంస్కారాలు కూడా లేకుండా వున్న జుత్తుతో, మురికి పట్టి వున్న పొడవైన గోర్లతో, సరిగా స్నానాలు కూడా చేయకుండా చాలా అపరిశుభ్రంగా వుంటారు. సార్ చెప్పిన మాట ఒక్కటి కూడా వినక పోగా విపరీతమైన అల్లరి చేసే వారుగా వుంటారు. వారి అల్లరి తగ్గించేందుకై తన మొదటి పద్ధతిగా " ఓం శాంతి " ప్రయోగం చేసి విఫలం అవుతారు. అలాంటి ఆ విద్యార్థుల అల్లరి, ఆకతాయి చేష్టలను చూసి తట్టుకోలేక , బాబోయ్ ! ఈ పిల్లలకా ! నేను పాఠాలు చెప్పేది !? అని విస్తుపోయి తదుపరి రోజుకు తాను ఏం చేయాలో ? ఆలోచించుకోవాలి అనుకుంటాడు. వీరికి తాను రూపొందించుకొని వచ్చిన పద్ధతులు పనికి రావని నిర్ణయించుకొని, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితులలో ఆరోజు వారికి సెలవు ప్రకటించడం, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది.
        తర్వాతి రోజుకు కొత్త ప్లానుతో తరగతి గది లోకి అడుగిడిన గిజుభాయి గారికి , ఈ రోజు కూడా సెలవివ్వండి సార్...... ! అనే పిల్లల గోల ఎదురవుతుంది. అలాంటి పరిస్థితులలో వారికి తాను అనుకున్న కథలను హావభావాలతో చెప్పడం ద్వారా వారిలో బడిపట్ల, చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తారు. కేవలం హావభావాలతో ఉపాధ్యాయుడు కథలు చెబితే వాటిని వినడం ద్వారా పిల్లలలో సూక్ష్మంగా భావాలను గ్రహిస్తారని, ఇందులో కథాకథనం, అభిరుచి, జ్ఞాపకశక్తి, అభినయం అను వివిధ రకాల సామర్థ్యాలను సాధిస్తారని నిరూపిస్తారు. పరీక్షలంటే భాషను వశపరచుకోవడం అనే విషయాన్ని ఉపాధ్యాయులు గ్రహించాలనేది ఇందులో సారాంశం.
        ఈ పుస్తకంలో గిజూభాయి గారు పరీక్షల గురించి చెబుతూ, " విద్యార్థి తనంతట తాను ఇష్టపడి, తపనతో, అభిరుచితో, ఆసక్తితో చదువుతున్నపుడు , అదే విధంగా ఉపాధ్యాయుడు కూడా తనలోని జ్ఞానాన్ని విద్యార్థికి అందజేయాలనే కోర్కెతో పాఠాలు చెప్పినపుడు పరీక్షా వ్యవస్థ అవసరం లేకపోవచ్చు" అంటారు. నేటి పరీక్షలలోని మూల్యాంకనం, ర్యాంకుల విధానం వలన పిల్లలలో చిన్నప్పటి నుండే క్రూరమైన, ఒకరి గొంతులు ఒకరు కోసుకునే పోటీ మనస్తత్వం తయారౌతుందనేది వీరి ఆవేదన.
        అలాగే ఆట, పాటల పోటీలలో పిల్లలకు ఇచ్చే బహుమసుల కంటే, అదే ఖర్చుతో పాఠశాలలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించడం ఉత్తమమనేది మనందరం అంగీకరించాల్సిన విషయం.
        ఈ రీతిలో విద్యను నేర్పించే క్రమంలో తోటి ఉపాధ్యాయులతోనూ, ప్రధానోపాధ్యాయుల వారితోనూ, నిరసనలు ఎదురౌతాయి. తల్లిదండ్రులతో గొడవలు కూడా వస్తాయి. ఇలాంటి అనేకమైన వివిధ రకాల మెఱుగైన పద్ధతులతో అలాంటి వాతావరణంతో కూడుకునియున్న ఆ పాఠశాలలోని అలాంటి విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తిని ఎలా రేకెత్తించారో ? ఎలాంటి పద్ధతులు అనుసరించి తెలుగు, సామాన్య , సాంఘిక శాస్త్రాలు, వ్యాకరణాన్ని, స్వీయ రచనా  సామర్థ్యాలను, పత్రికల తయారీని, ఆట, పాటల ద్వారా ఆసక్తికరంగా వారిలో అన్ని రకాల విద్యా సామర్థ్యాలు ఎలా సాధించారనే గిజూభాయి గారి ప్రత్యక్ష అనుభవ సారమే ఈ "పగటికల".
        ఏ విద్యార్థినీ ఇబ్బంది పెట్టని అద్భుతమైన ఆహ్లాదకరమైన మూల్యాంకనా విధానాన్ని చేసి చూపిస్తారు గిజూభాయి గారు ఇందులో. వార్షికోత్సవం అంటే ఎలా వుండాలో కూడా చూపించి నిరూపిస్తారు. బోధనలో మూస పద్ధతి, బట్టీ పద్ధతులకు స్వస్తి చిప్పి, అధికారికి ఇచ్చిన ఒప్పందం ప్రకారం మాట నిలబెట్టుకుని, ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుని, అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఇంత మంచి బోధనా పద్ధతులున్న ఈ పుస్తకాన్ని, తప్పకుండా ప్రతి ఉపాధ్యాయుడు చదవవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఈ పుస్తకం చదివిన ఉపాధ్యాయుడు వీటిని అనుసరిస్తే , ఏ పాఠశాలలోనైనా దండన, శిక్షలు లేకుండా విద్యార్థులను తీర్చిదిద్దగలుగుతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీరి పద్ధతులను తు.చ. తప్పకుండా అనుసరించిన ఉపాధ్యాయులు ఇది " పగటికల " కాదు, ఎవరైనా సాధించగల " నిజమైన కల " అని ఒప్పుకుని తీరుతారు .
                                    సమీక్ష : మద్దిరాల శ్రీనివాసులు,
                            ౩వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచయిత,
                                    సెల్ : 9010619066 


 ( పుస్తక సమీక్ష )

నైతిక విలువలకు నెలవు - "కథా చిత్రాలు, - బతుకు పాఠాలు " " పుస్తకం  ఈ పుస్తకము యొక్క సమీక్షను.... ఈ లింక్ ద్వారా pustakam.net లో చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి.        

                                                                                                 - మద్దిరాల శ్రీనివాసులు, టీచర్

          పుస్తకం పేరును గమనిస్తే "కథాచిత్రాలు" అనగా " మన కళ్ళముందు కనపడే కథల భావ దృశ్యాలు" అనీ, "బతుకు పాఠాలు" అనగా "మన జీవితాలలో జరిగే అనుభవ సారాలు" గా వెరసి, జీవితంలో ఎదుర్కొనబోయే అనుభవ సారాలు అనే అద్భుత భావాన్ని పుస్తకం పేరులోనే స్ఫురింపజేశారు.  జీవిత సత్యాన్ని తెలియజేసే మంచి బొమ్మ ముఖచిత్రంగా చక్కగా, ఆకర్షణీయంగా, తగినదిగా పాణిగారి కుంచె అద్భుతాన్ని సృష్టించింది.

          నేటి కాలంలో దాదాపుగా ప్రతి పాఠశాలలో కూడా " చదువు, పరీక్ష, ర్యాంకు" అనే ముచ్చటైన మూడు ముక్కలాటకు తప్ప,  నైతిక విలువలకు, కళలకు మాత్రం ప్రాధాన్యత లేని పరిస్థితి నెలకొని వున్నది. ఇటువంటి తరుణంలో దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్  వారు పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడానికి, రేపటి కాలానికి ఒక మంచి తరాన్ని అందివ్వాలనే సదుద్దేశంతో ఇటువంటి ఒక మంచి పుస్తకాన్ని విడుదల చేయడం ముదావహం.

          పుస్తకం లోని కథలలోకి తొంగి చూస్తే,

           ప్రారంభంలోనే తాను జైలులో వుండి కూడా ముసలివాడైన తన తండ్రికి ఎలాగైనా సాయపడాలని  మనసులో ఒక ధృఢ సంకల్పంతో కేవలం ఒక ఉత్తరం రాయడం ద్వారా నాన్న పొలాన్ని దున్నింపజేస్తాడు. అలా మనసులో సంకల్పం వుండాలే కాని, ఏదైనా సాధించవచ్చుననే మంచి మనస్తత్వంతో కూడిన  విలువున్న కథ "ఉత్తరం దున్నిన పొలం" పుస్తకానికే హైలెట్. 
          "నిజమైన స్నేహితుడు" కథలో   హరీష్ అనే అబ్బాయికి లుకేమియా వ్యాధి రావడం వలన కీమో థెరపి చేయాల్సివస్తుంది. దాని సైడ్ ఎఫెక్ట్ వలన బాబుకు జుట్టు అంతా రాలి పోతుంది. తోటి పిల్లలంతా ఎగతాళి చేస్తారు. హరీష్ బడికి రావడానికే భయపడతాడు. కాని, తరగతిలో చదువుతున్న ఏడేళ్ళ సింధు అనే పాప మాత్రం బాబు ఇంటికి వెళ్ళి, ధైర్యం చెప్పి, తాను బడికి రావాలని , ఎగతాళి వ్యవహారం తాను చూసుకుంటానని చెపుతుంది. హరీష్ కు తోడుగా తాను ఆడపిల్ల అయి వుండీ కూడా తన తల్లిదండ్రులచే ఒట్టు వేయుంచుకొని మరీ , వాళ్ళు బాధపడినా తన జుట్టు మొత్తం తీయుంచుకుంటుంది. విషయం తెలిశాక పాప తల్లిదండ్రులు కూడా కూతురు చిన్నదైనా అంత ఉన్నతంగా ఆలోచించినందుకు సంతోషపడతారు. అలా ఎగతాళి చేస్తున్న పిల్లలకు అంత చిన్న వయసులోనే కనువిప్పు కలిగించిన సింధు అనే పాప నడవడిక కథ చదివిన పిల్లలకైనా, పెద్దలకైనా కళ్ళు చెమర్చేలా చేస్తుంది. 
పిల్లలలో నైతిక విలువలు పెంపొందింప జేయడానికి సంబంధించిన కథలు వుండడం ఒక ఎత్తైతే,
          అహింసా మార్గంలో కూడా పిల్లలలో మంచి గుణాలను పెంపొందించవచ్చునని చెప్పే "గాంధేయవాదం" , ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం వుంటుందని తెలిపే "మెదడుకు మేత"  లాంటి పెద్దలకు, పిల్లలకు సంబంధించిన కథలుండడం మరో ఎత్తు.
          విధంగా పుస్తకంలోని ఇరవై ఐదు కథలలో ప్రతి కథా అద్భుతమే. విలువలతో కూడినదే. చిన్నా, పెద్దా అందరూ చదువదగిన పుస్తకం ఇది.
          నేటి పిల్లలు అందరూ రాబోయే కాలానికి వారధులు, సమాజ నిర్మాణ సారధులు కాబట్టి, పిల్లల బాల్యం ఎప్పుడూ తల్లి,తండ్రి, ఉపాధ్యాయుల చెంతనే వుంటుంది కాబట్టి, పుస్తకాన్ని ముందుగా వారు చదవాలి. అప్పుడు తప్పకుండా సమజంలో కొంత మార్పు వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం.
          పొందికైన వాక్య నిర్మాణాలతో, అలతి అలతి పదాలతో చిన్నారులకు సైతం అతి తేలికగా అర్థమయ్యేలా వున్న అనువాద రచన చేసిన చిలకపాటి రవీంద్రకుమార్ సృష్టి అనిర్వచనీయం.
          ఇంత మంచి విలువలున్న ఈ పుస్తకాన్ని కేవలం 22-00 రూపాయలకే అందిస్తున్నారు దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు. పుస్తకమును పొందుటకు దేవినేని మధుసూధనరావు, చైర్మన్, దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు-521 260, కృష్ణా జిల్లా చిరునామాలో గానీ, లేదా ఫోన్:0866-2862424 లోనూ  మరియు  email:mdevineni@gmail.com ద్వారా సంప్రదించవచ్చును.
నా ఈ సమీక్షను www.pustakam.net లో ఈ క్రింది లింక్ ద్వారా చూడవచ్చును
http://pustakam.net/?p=17549
ఉపాధ్యాయునికి ఒక చక్కని చుక్కాని - "పల్లె పిలిచింది" నవల
-మద్దిరాల శ్రీనివాసులు, టీచర్
           ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు ఏ మాత్రం ఎదుగూ,బొదుగూ లేని ఒక సాధారణ పాఠశాలను అక్కడి గ్రామస్తులు,ఉపాధ్యాయుల సహకారం సాధించి ఎలా అద్భుతంగా అభివృద్ధి చేశాడనే ఉదంతంతో వ్రాసిన నవల.
సూక్ష్మంగా నవలలోకి తొంగి చూస్తే , ఒక సినిమా ఫక్కీలో సాగుతుంది ఈ కథ. ఇది మనం చెప్పుకోబోయే ప్రసాద్ అనే ఉపాధ్యాయుని ఆత్మకథ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉపాధ్యాయునికి చిత్తూరు జిల్లా లో ఎక్కడో ఒక మారు మూలనున్న జంబాడ అనే గ్రామానికి  బదిలీ అవుతుంది. అతనో బ్యాచులర్. అతను ఇబ్రహీం అనే ఒక అనాధ బాలుడిని చేరదీసి తన వద్దే వుంచుకుంటూ చదివిస్తుంటాడు. ఆ అబ్బాయితో కలిసి ఎక్కడ వుందో తెలియని జంబాడ గ్రామాన్ని చిరునామా సహాయంతో ఆరా తీసుకుంటూ సాగే ప్రయాణంతో ప్రారంభం అవుతుంది ఈ నవల.
అంతకు ముందు చిత్తూరు పాఠశాలలో తాను పని చేస్తున్నపుడు అక్కడి కమిటీ ప్రెసిడెంట్ గారి బావమరిదికి సున్న మార్కులు వస్తే ప్రమోట్ చేయలేదని నీతి,నిజాయితీ లతో చక్కగా పాఠాలు చెప్పే తనను జంబాడకు హెడ్ మాస్టర్ గా ట్రాన్స్ ఫర్ చేశారు. ఎప్పుడో ఉదయం బయలుదేరిన తను గత స్మృతులు తలచుకుంటూ అతి కష్టంమీద జంబాడకు చీకటి పడే వేళకు చేరుకుంటాడు. అప్పటికే ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా ఉన్నతను కొత్తగా తన స్థానంలో వచ్చే వారి కోసం ఎదురు చూస్తుంటాడు. ప్రసాద్ గారు ఇలా వెళ్ళారో లేదో వెంటనే ఛార్జ్ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ జైలు లోంచి విడుదలైన ఖైదీలా పరిగెత్తుతాడు. అప్పటికే ఆ పాఠశాలలో  యాభైఆరు మంది పిల్లలతో ముగ్గురు పనిష్మెంట్ పైన, ఇద్దరు కొత్తగా పోస్టింగ్ అయిన టీచర్స్ వున్నారని తెలుస్తుంది. రాత్రికి శ్రీనివాసులు అనే సీనియర్ టీచర్ వాళ్ళ ఇంట్లో బస చేస్తాడు. తరువాత గతంలో ఉన్న హెడ్ మాస్టర్ ఎప్పుడూ బడికి సరిగా రాకుండా సంతకాలు చేయడం , జీతాలు తీసుకోవడం తప్ప ఏమీ చేయడని తనమీదే బడి బాధ్యత ఉంచుతాడని శ్రీనివాసులు సార్ చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడి వాతావరణంలో ఇమడలేక  తాను ఇక్కడ ఉండలేనని ప్రసాద్ సార్ ట్రాన్స్ ఫర్ చేయుంచుకొని వస్తానని శ్రీనివాసులు సార్ తో చెప్పి తన ప్రయత్నాలు చేసి కుదరక అదే ఊర్లో వుండవలసి వస్తుంది. ఇక అప్పటినుండి ఆ పాఠశాలలోనే వుంటూ తనవృత్తిపై గల అంకితభావంతో తోటి ఉపాధ్యాయులలోనూ, గ్రామస్తులలోనూ, ప్రెసిడెంటు, కమిటీ మెంబర్లలోనూ ఒక్కొక్కరిగా మార్పు తెస్తాడు.  రకరకాల వ్యక్తిత్వాలున్న వాళ్ళ సహకారం సాధించుతాడు. అందరిలోనూ చైతన్యం తెస్తాడు. చివరికి ఆ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాడు ప్రసాద్ సార్. విద్యార్థులలో బోధన, బోధనేతర విషయాలు నేర్పుతూ, పిల్లలను విద్యావంతులను చేస్తూనే పాఠశాలకు నూతన స్థలం సాధించి, అందులో కొత్త పాఠశాల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. బడి ముఖం కూడా చూడని గ్రామస్తులు, చివరికి ప్రసాద్ సార్ ట్రాన్స్ ఫర్ పై ఆ ఊరు వదలి వెళుతుంటే కంట తడి పెట్టని వారు లేరు. వృత్తిలో అంకితభావం, పని పట్ల నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత, కలిగి నిస్వార్ధము తో కూడిన ప్రసాద్ గారి జీవితం ప్రతి ఉపాధ్యాయునికి ఆదర్శం. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడూ ఆశావాద దృక్పథంతో వుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన పాత్ర ప్రసాద్ గారిది.
ఇందులో శ్రీనివాసులు సార్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి పరోపకారంతో తన భార్య ఉద్యోగాన్ని వదులుకోవడం హైలెట్.  ప్రసాద్ సార్ కొలీగ్స్ నడుచుకునే కలుపుగోలుతనం, గ్రామస్తుల పరిచయాలు, పనుల సాధించడం, మొ!!నవన్నీ నేటి టీచర్లకు ఆదర్శాలే. రచయిత వెంకటరత్నం గారు చిత్తూరు జిల్లా లోని , యాస, భాషలతో నవలలో వాస్తవికతను కళ్ళకు కట్టించాడు.
అందమైన పల్లె వాతావరణంతో కూడిన బాజీ గారు అందించిన ముఖచిత్ర్రం ఈ పుస్తకానికి మరో హైలెట్. 39 భాగాలుగా 231 పేజీలలో రచించిన ఈ నవల పాఠకులను బ్రేక్ లేకుండా చదివింపజేస్తుంది. కథ అయినా ఇది ప్రతి ఉపాధ్యాయుడికీ ఒక చక్కని గైడ్. ఆచరణ సాధ్యమయిన కథ ఇది. రచయితకు తొలి నవలయినా రచనలో ఎంతో అనుభవం వున్నట్లే అనిపిస్తుంది. సముద్రంలో ప్రయాణించే నావలోని వారికి  చుక్కాని లాగా బోధనచేయుచున్న ప్రతి ఉపాధ్యాయుడు ఈ నవల తప్పక చదివి తీరవలసిందే. ఇంత మంచి నవలను 2001 లో ద్వితీయ ముద్రణ ద్వారా మనకు అందించిన హైటెక్ ప్రింట్ సిస్టమ్ లిమిటెడ్ అధినేత శ్రీ దేవినేని మధుసూధన రావు ఎంతైనా కృతజ్ఞతలు తెలపాలి. అనేకమంది విద్యావేత్తలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇండియా టుడే, ఆంధ్రభూమి వంటి అనేక పత్రికలు కూడా కొనియాడిన నవల ఇది.
ఆనాటి ఈ నవల ఖరీదు రూ.75.౦౦ లు. ఉపాధ్యాయుడికి అందుబాటులో వున్న ఖరీదే. కానీ, నేటి పాఠశాల ఉపాధ్యాయులకు బోధనలో మెళకువలకై ఎన్నో శిక్షణలు, పుస్తకాలు అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నవలను రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు పంపిణీ చేయవలసిన అవసరం, ప్రతి ఉపాధ్యాయునిచేత చదివించవలసిన అవసరం ఎంతైనా వున్నదని నేను నొక్కి వక్కాణిస్తున్నాను.
ఈ నవలా కాపీలకు “దేవినేని మధుసూధనరావు, చైర్మన్, దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు-521 260, కృష్ణా జిల్లా చిరునామాలో గానీ, లేదా ఫోన్:0866-2862424 లోనూ  మరియు  email:mdevineni@gmail.com ద్వారా   సంప్రదించవచ్చును.

        " నొప్పి డాక్టరు "పుస్తక సమీక్ష   

వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్,
త్రిపురాంతకం, సెల్: 9010619066
**********
పిల్లలకు సరదాగా, జాలీగా పుస్తక పఠనంపై ఆసక్తి, నైతిక విలువలు పెంపొందించే ఉద్దేశంతో ముద్రింపబడిన పుస్తకం ఇది. సహజంగా డాక్టరు గారి లాగే పక్షి, జంతు ప్రేమికులైన పిల్లలకు ఈ పుస్తకం ఆసక్తిగానే వుంటుందని నేను భావిస్తున్నాను. అంతే కాకుండా ” ఖుషి” టివి లాంటి చానల్స్ లో వచ్చే కార్టూన్ సినిమాలను వదలకుండా చూస్తున్న నేటి బాలల కోసం, ఒక కార్టూన్ సినిమాను చూసిన ఫీలింగ్ కలిగేలా పుస్తక రూపంలో అందించడం బాగుంది. వినోదంతో పాటు జంతువులకు, పక్షులకు సంబంధించిన విజ్ఞానం కూడా వారికి అందిస్తుందీ పుస్తకం. పుస్తకం పేరు, లోపలి భాష, జంతువుల, పక్షుల చేష్టలు పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంటాయి ఇందులో. పిల్లల మెదడును ఆలోచింపజేస్తుంది. ఇతరులను గౌరవించడం , మంచిగా మాట్లాడే విధానం, అందరినీ కలుపుకుపోవడం, జంతువులను ప్రేమించడం లాంటి నైతిక విలువలు కూడా నేర్చుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే టి.వి.లకు అతుక్కుపోతూ, చదవడంపై
ఆసక్తి లేని పిల్లలున్న కాలమిది. అలాంటి పిల్లలను సైతం పుస్తక పఠనం వైపు మళ్ళించగల ఒక మంచి టానిక్ ఈ “నొప్పిడాక్టర్” పుస్తకం.
హాయ్ ! పిల్లలూ. మీకోసం ఓ మంచి పుస్తకమర్రా !ఏంటి పుస్తకం పేరా? విచిత్రంగా వుంది కదూ! నాక్కూడానూ. అందుకే వెంటనే చదివేశాను. భలే తమాషాగా వుంది. చాలా సరదాగా కూడా వుంది. చదువుతుంటే, ఖుషి టి.వి.లో కార్టూన్ సినిమా చూసినంత ఉల్లాసమేసింది. ఊ…..నిజం. కాస్త రుచి
చూపించమంటారా….?! సరే అయితే….
నొప్పి డాక్టరు గారితో వాళ్ళ అక్క “వర్వారా”, ఇద్దరు పిల్లలు తాన్యా, వాన్యా వుంటారు. డాక్టరు గారు జంతు, పక్షి ప్రేమికుడు. ఎంతటి జంతు ప్రేమికుడంటే, తన ఇంట్లో ఎప్పుడూ అల్మారాలో ఉడుత, గదిలో కుందేళ్ళు, చెక్క అరలో కాకి, సోఫాలో ముళ్ళపంది ఇలా ఆయన చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంటాయి. పైగా డాక్టర్ గారు జాలి గుండె కలవారు. అందుకే ప్రకృతి కంటే కూడా డాక్టరు గారి ఇల్లే వాటికి స్వర్గంలా అనిపించేది. అతని దగ్గరకు వచ్చే రోగులంతా నొప్పి,..నొప్పి… అంటూ వస్తుంటారు. వారికి వచ్చిన ఎలాంటి నొప్పినైనా సరే! క్షణాల్లో తన వైద్యంతో మాయం చేస్తారు. అందుకే అందరూ “నొప్పి డాక్టరు ” అని పిలవసాగారు. ఈయన దగ్గరికి వైద్యం కోసం వచ్చి డాక్టరు గారి ఇంట్లో వాతావరణం చూసి, ముగ్ధులైపోయి అక్కడ సెటిలైపోయినవారే వాన్యా, తాన్యా లు. అంతటి ఆకర్షణీయ వాతావరణం అక్కడ ఉంటుంది. ఆయన అందరిపై చూపించే ప్రేమ అలాంటిది మరి.
ఇందులో ప్రాణుల పేర్లు కూడా చాలా విచిత్రంగా , తమాషాగా వుంటాయి. బాతు పేరు “కికా”, పంది పిల్ల పేరు “గుర్రు గుర్రు”, చిలుక పేరు “కరుడొ”,
గుడ్లగూబ పేరు “బుంబా….ఇలా. అంతే కాదర్రోయ్! ఇందులో జంతువులు, పక్షులు మాట్లాడతాయి కూడా ! ఆ…. వాటి భాష కూడా భలే తమాషాగా వుంది. ఏంటి? నమ్మడం లేదా? అయితే ఓ చిన్న సంభాషణ చూడండి.
ఒక రోజు ఒక గుర్రం, “లామా, వనోయ్, ఫిఫి, కుకు” అంటూ మన డాక్టరు గారి దగ్గరకు వస్తుంది. అంటే….”నాకు కళ్ళు పోటుగా వున్నాయి. కళ్ళజోడు ఇవ్వండి” అని అర్థమట. వెంటనే మన డాక్టరు గారు, “కపూకీ, కపూమాకీ” అంటాడు. అంటే, “దయచేసి కూర్చోండి” అని అట. ఏంటీ! ఇదేం భాషా? అనుకుంటున్నారు కదూ! అదేమరి, జంతు భాష అంటే. వాళ్ళకు అర్థమయ్యిందిలెండి. అందుకే డాక్టరు గారు అలా అనగానే అది కూర్చుంది. ఇంకేముంది, కళ్ళకు అద్దాలు పెట్టేశారు మరి. ఫీజు లేదు, బిల్లూ లేదు. ఉచితమేనర్రా! ఊ….. చూశారా! మన డాక్టరు గారిది జాలిగుండె అని తెలిసిందిగా. వెంటనే దానికి కళ్ళ నొప్పి ఇట్టే మాయమయింది. వారెవ్వా…! నొప్పి డాక్టరా …మజాకానా…!. ఇక వెంటనే ఆ గుర్రం “చాకా” అంటూ తోక ఆడించుకుంటూ, జాలీగా కళ్ళద్దాలతో వీథిలోకి వెళ్ళిపోయింది. “ఓ! “చాకా” అంటేనా? ధన్యవాదాలు అనట.
ఇలా గుర్రం వలన విషయం తెలుసుకున్న కళ్ళ నొప్పులున్న ఆవులూ, కుక్కలూ, పిల్లులూ, ఆఖరికి ముసలి కాకులు కూడా మన డాక్టరు గారి దగ్గరికి
వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా కళ్ళజోళ్ళను ఫ్రీగా తగిలించేవారు. ఈ విధంగా ఊళ్ళో మనుషులతో పాటు అడవిలోని జంతువులూ, పక్షులు, నీళ్ళలోని
తాబేళ్ళు, ఆకాశంలోని కొంగలూ, గ్రద్దలూ నొప్పులున్న ప్రతి ప్రాణీ ధైర్యంగా డాక్టరు గారి దగ్గరికి వైద్యానికి వచ్చేవి. కొద్ది కాలంలోనే మన నొప్పిడాక్టరు గారికి అందరూ అభిమానులైపోయారు.
ఇంకో రోజు మెడనొప్పి అంటూ, ఒక కోతి వస్తుంది దాని పేరు “కిచకిచ”. దానికి వైద్యం చేస్తారు. అది అక్కడే వుండి పోతుంది. ఒకనాడు దాని యజమాని
వస్తాడు. అతను రాగానే మన టామీ, “గుర్..గుర్…” మంటుంది. అంటే “పారిపో! లేకుంటే కరిచేస్తాను,” అని అర్థమట. బ్రతుకుజీవుడా! అనుకుంటూ
పారిపోతాడతను. నొప్పి డాక్టరైనా నొప్పులే కాదర్రోయ్! రెక్క తెగిన సీతాకోక చిలుక వస్తే, దానికి ఎర్ర చుక్కలతో మెరిసిపోతున్న సిల్కు గుడ్డతో రెక్క కుట్టి , నిప్పుకు దూరంగా వుండమంటూ జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తారు. సూపర్ కదా! ఇందులో మరో విచిత్ర జంతువు కూడా వుందర్రోయ్. దాని పేరు “తోపుడు లాగుడు”. ఆ… ఏంటి? నవ్వు వస్తోందా? అవును, జంతువుల పేర్ల లాగే ఈ కథల్లో డైలాగులు కూడా ఇంకా చాలా …భలే భలే సరదాగా వున్నాయ్.
“కరాబుకి, మరాబుకి, బూ” అంటే “మీకు సాయం చేయకుండా ఎలా వుంటాం?”
“ఆబుజో, మబుజో, బాక్” అంటే “మేము మిమ్మల్ని వదిలిపెట్టం, మీ నమ్మిన నేస్తాలుగా ఉండిపోతాం”
“కిసాఫా, మాక్” అనగా “ఇది నొప్పి డాక్టర్ గారి ఇల్లేనా?” అనట. భలే వున్నాయి కదా!
అంతేనా? ఇలా జంతువులు, డాక్టరు గారు కలిసి కోతులకు వైద్యం చేయడానికని, సముద్రంలో ఓడపై ఆఫ్రికా కూడా వెళ్తారు. మరి ఈ ప్రయాణంలో డాక్టరు గారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మన డాక్టరు గారికి జంతువులు సాయం చేస్తాయి. ఇలా ఎంతో సరదాగా సాగే, “మర్కట రాజ్యానికి యాత్ర,”, పింటూ, సముద్రపు దొంగలు” అనే రెండు కథలు సరదా సరదా బొమ్మలతో ఇందులో చాలా బాగా వున్నాయి . ఏంటి? రుచి చూపిస్తూ ఉంటేనే మనసు ఊరించి పోతోందా!? అయితే, ఇంకేం ? చదివేయండి మరి ఈ పుస్తకాన్ని. మీకు బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. చాలా ఎంజాయ్ చేస్తారు.
ఎంతో సరదాగా , జాలీగా విజ్ఞానంతో కూడిన ఈ పుస్తకం రష్యా భాషలో “కొర్నేయ్ చుకోవ్ స్కీ” అనే రచయిత వ్రాయగా 1986 లో ప్రథమంగా ముద్రింపబడింది. దీనిని “ఆర్వియార్ ” అనే రచయిత తెలుగులో అనువదించగా, వి.దువిదేవ్ గారితో చక్కని బొమ్మలు వేయించి, పిల్లల ప్రేమికులు, బాలలసాహిత్య ప్రచురణ కర్తలు అయిన దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు చక్కటి అందమైన బైండింగ్ తో పిల్లలు చదివేందుకు వీలైన అచ్చుతో ఇదిగో ఇటీవలనే జులై 2015 లోనే ఇలా ఇండియాలో మన ముందుకు తెచ్చారు.
180 పేజీలతో హైదరాబాద్ లోని చరిత ఇంప్రెషన్స్ వారు ముద్రించిన ఈ బుక్ చాలా ఇంప్రెసివ్ గా వున్నది. దీని ఖరీదు రూ|| 200-00 లు. కాస్త
ఖరీదనిపించినా, దీన్ని చదివిన పిల్లలు పొందే ఆనందం, విజ్ఞానాల ముందు ధర దిగదుడుపే.
ప్రతులు దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు, కృష్ణా జిల్లా, పిన్: 521260 అను చిరునామాలోనూ; సెల్: 9989051200, email:
mdevineni@gmail.com ద్వారానూ పొందవచ్చును.
మరో చిరునామా: మంచి పుస్తకం, 12-13-439, వీథి నెం:1, తార్నాక, సికింద్రాబాద్, పిన్:500017, సెల్: 9490746614, email: info@manchipustakam.in, website: www.manchipustakam.in

 

చదవడం అంటే ఏమిటి… నేర్చుకోవడం అంటే ఏమిటి…

chadavadamante.....
వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, సెల్:9010619066
*********
పుస్తకం పేరు: చదవడం అంటే ఏమిటి… నేర్చుకోవడం అంటే ఏమిటి…
రచయిత: సీవీకే ( సీ.వీ.క్రిష్ణయ్య గారు)
ఈమధ్య కాలంలో ఉపాధ్యాయుల కోసం వచ్చిన అద్భుతమైన ఉపయుక్త పుస్తకం ఇది.
క్లాసు రూముల్లో కష్టపడవలసింది విద్యార్థి కాదు, ఉపాధ్యాయుడు అంటారు రచయిత ఇందులో. నిజమే కదా! అయితే ఈ వాక్యాన్ని వక్రీకరించే వారు కూడా వుంటారని ముందే ఊహించిన రచయిత ఈ వాక్యం వెంటనే “విద్యార్థి, తన విజ్ఞాన సాధనలో నేర్చుకుంటున్నాననే స్పృహ కలుగకూడద”నే మరో వాక్యాన్ని జోడించారు కూడా.
బోధన అంటే విద్యార్థిని చేయి పట్టుకుని నడిపించడం కాదంటారు. తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా పిల్లలు ఆడుకుంటూ కనబడితే చాలు… వారిని పాడైపోతారని, ఎప్పుడూ కుదురుగా వుండలేర్రా మీరు? అని, తిట్టేవారే ఎక్కువ. అలాంటి వారికి, పిల్లలు ఆటలు ఆడకపోతే ఎంతగా నష్టపోతారో తెలిపే జవాబు ఈ పుస్తకం. చాలావరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చి, “మా పిల్లవాడు చెప్పిన మాట వినడం లేదు సార్, నాలుగు తన్ని భయం చెప్పాలి మీరు” అని, ఫిర్యాదు చేస్తుంటారు. అపుడు కొందరు ఉపాధ్యాయులు ఆ పరిస్థితులలో ఆ పిల్లలను మందలించడమో, కొట్టడమో చేస్తుంటారు. అది ఎంత తప్పో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.
“తెలివితేటలు అంటే “, అనే అంశంలో, జాన్ హాల్ట్ గారు తెలిపిన మాటలను ఉదహరిస్తూ,ఎంతో అద్భుతమైన వివరణ యిచ్చారు ఇందులో రచయిత. తెలుసుకోవడానికి-నేర్చుకోవడానికి, ఉపాధ్యాయుడికి-గురువుకి గల తేడాలను చాలా చాలా చక్కగా వివరించారు. ఇవి చదువరులకు చాలా ఉపయుక్తం.
“మెదళ్ళకు తాళాలేసి…” అనే అంశంలోనైతే క్లాసు రూములో విద్యార్థులు ఎంత చిలిపిగా వ్యవహరిస్తుంటారో, ప్రత్యక్షంగా వర్ణించారు. “హీరోలు – జీరోలు” లో తన స్వీయ సంఘటనలతో, పిల్లవాడికి ఫిక్స్డ్ నాలెడ్జ్ అందిస్తే ఎలా నష్టం జరుగుతుందో తెలిపారు. పిల్లలలో నీతిబోధ కోసం వారిని కొట్టకుండా, తిట్టకుండానే, వారిలో మార్పు తేవడానికి, నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకోవాలో తెలిపారు.
ఇలా, ఈ పుస్తకంలో ప్రతి ఒక్క విషయం ఉపాధ్యాయులకు ఒక సహాయకారిగా వున్నది. ఇటు తల్లిదండ్రులకు కూడా పనికి వచ్చే విషయాలు కూడా చాలా వున్నాయి. రచయిత ఇందులోని ప్రతి పేజీని విలువైనదిగా మలిచారు.
మరొక అద్భుతమేంటంటే, గురువుకు తానిచ్చిన ఒక గొప్ప నిర్వచనం, “గురువు అంటే ఒక ఫలవృక్షమట”, దానిని వివిధ రకాల విద్యార్థులు ఎలా వాడుకుంటారో గొప్పగా చెప్పారు. హ్యాట్సాఫ్ సీవీకే గారూ…
ఇంత గొప్పగా ఈ పుస్తకాన్ని వ్రాసిన రచయిత కూడా ఒకప్పుడు ఉపాధ్యాయులుగా పని చేసినవారే. ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికీ, సీవీకే గారు ఎంత గొప్ప ఉపాధ్యాయులో…. కాదు, కాదు, ఎంత గొప్ప గురువులో అర్థమవుతుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దలు, ప్రభుత్వ అధికారులతో పాటు, పాఠ్యపుస్తక రచయితలు కూడా చదువదగిన పుస్తకం ఇది. చివర ముగింపు ఈ పుస్తకం విలువను ద్విగుణీకృతం చేసేదిగా ఉన్నది.
ఒక మాటలో చెప్పాలంటే, ఉపాధ్యాయ వృత్తిలో వున్న వారందరికీ ఇది ఎంతో ఉపయుక్త గ్రంథంగా వుంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. పదవ తరగతి అమ్మాయితో ఇందులో చిత్రాలు వేయించడం కూడా కొసమెరుపు. రచనంతా ద్రాక్షాపాకంలో సాగించారు.
72 పేజీలతో మూడవ ముద్రణగా, ఆకర్షణీయ ముఖ చిత్రంతో ఫిబ్రవరి 2015 లో జనవిజ్ఞాన వేదిక వారి ప్రచురణ ద్వారా మన ముందుకు వచ్చిన ఈ పుస్తకం వెల కేవలం రూ.35=00 లు మాత్రమే. అంటే ఈ వేసవి కాలంలో నష్టం అని తెలిసినా త్రాగడానికి వెనుకాడని పనికి రాని కూల్ డ్రింక్ కై వెచ్చించే ఖరీదన్నమాట. 2012 లో ప్రథమ ముద్రణ పొంది, మూడు సంవత్సరాల స్వల్ప కాలంలోనే మూడవ ముద్రణకు స్వీకారం చుట్టినదంటే, ఈ పుస్తకం ఎంతగా ఉపయుక్తమైనదో తెలుస్తున్నది.
ఇంత మంచి పుస్తకాన్ని నాకు పంపి, చదివే అవకాశం కలిగించిన విద్యాప్రేమికులు, విద్యార్థిప్రేమికులు “దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ,తెన్నేరు, “అధినేత “శ్రీ దేవినేని మధుసూదనరావు” గారికి కృతజ్ఞతలు.
ఈ పుస్తకం కొరకు మనము “బి.క్రిష్ణారెడ్డి, ప్రచురణల విభాగం, 15/984, వెంకట్రామపురం, నెల్లూరు” అనే చిరునామాలోనూ, 9493355144 అనే సెల్ ద్వారానూ మరియూ అన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ ల లోనూ సంప్రదించవచ్చును.

మాతృభాషా మాధ్యమమే ఎందుకు? సమీక్ష:- మద్దిరాల శ్రీనివాసులు, 9010619066  మాతృభాషా మాధ్యమమే ఎందుకు? అనే పుస్తకము పైన నేను వ్రాసిన సమీక్ష... http://pustakam.net/?p=20855 అనే *లింక్* నందు చదువగలరు..


పుస్తకం పేరు : మాతృభాషా మాధ్యమమే ఎందుకు? రచయిత: శ్రీ సింగమనేని నారాయణ
పబ్లిషర్స్‌: జనసాహితి ప్రచురణ పేజీలు:40 వెల: రూ.20లు.
సమీక్ష:- మద్దిరాల శ్రీనివాసులు, 9010619066------------------------------------------------------------------- ఆంగ్ల బోధనా మాధ్యమం, తెలుగు బోధనా మాధ్యమాల గురించి వాదించుకుంటున్న వారందరికీ దిక్సూచి ఈ ''ఈ మాతృభాషా మాధ్యమమే ఎందుకు?'' 

తెలుగు, ఇంగ్లీషు మాధ్యమ బోధనా ఉద్యమకారులు ఇరువురూ కాసేపు వారి భేషజాలను పక్కకు పెట్టి, ఈ పుస్తకాన్ని ఆసాంతం చదవవలసినదిగా నా మనవి. చదివిన తరువాత ఏ మాధ్యమ బోధన ఎందుకు అవసరమో? ఏది సమంజసమైనదో నిర్ణయించుకోండి.  రెండు  రకాల  భావాలు  కలిగిన  వ్యక్తులు ఎం.ఎల్‌.ఏ లైనా, భాషావేత్తలైనా, మంత్రులైనా, ఉపాధ్యాయులైనా, ఏ వృత్తిలో వారైనా, ఏ ఉద్యమకారులైనా అందరూ  పిల్లల తల్లిదండ్రులే కాబట్టి, ముందు తప్పని సరిగా ఓ తల్లి, తండ్రిగా మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి, అలాగే ఈ వాదనలు చేసే వారమంతా, తెలుగు వారమే కనుక, మన భాషా భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ చిరు పొత్తం కొని చదువుతారని నా కోరిక. ఆపై మీ నిర్ణయం మీరు తీసుకోండి. 
చాలా కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న ఒక చర్చ '' ఆంగ్ల మాధ్యమ బోధన మేలా? తెలుగు మాధ్యమ బోధన మేలా? '' అని. ఎక్కువ శాతం ఆంగ్ల మాధ్యమ బోధన అయితేనే ఉపాధి అవకాశాలు మెండుగా                   ఉంటాయన్న వాదనను వినిపిస్తుంటారు. వినిపిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమ బోధన అయితేనే, ఏ భాషనైనా నేర్చుకోగల సత్తా వస్తుందనేది తెలుగు మాతృభాషా ప్రేమికుల వాదన. ఏదైనా ఎవరికి నచ్చింది వారు, ఆ భాష పైన మక్కువతో వినిపిస్తున్న మాటలు.కానీ, పూర్తి స్థాయిలో ఏ మాధ్యమమైతే సరియైనదో చెప్పగల వారు కొందరే ఉంటారు. అలా చెప్పగలిగిన మేధావి వర్గంలోని గొప్ప వ్యక్తి శ్రీ సింగమనేని నారాయణ గారు.
అయితే, ప్రస్తుత తరుణంలో నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు మాధ్యమ పాఠశాలల స్థానంలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ఏర్పాటు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఈ చర్చ తీవ్రతరమైనది. ఇలాంటి ఈ పరిస్థితులలో ఏ భాషామాధ్యమంలో బోధన చేస్తే సబబైనదో తెలుపగల సత్తా ఉన్న పుస్తకం ఇది.
ప్రస్తుతం చాలా మంది తెలుగు ప్రజలు ఘాటుగా మాట్లాడే కొన్ని మాటలు చూస్తే.... 
1) ఇంగ్లీషు మీడియం చదివితేనే పిల్లవాడికి మంచి భవిష్యత్తు , ఉన్నత ఉద్యోగం లభ్యమవుతుంది.
2) తెలుగు మీడియం చదవడమంత శుద్ధ దండగ ఇంకోటి లేదు.
3) పిల్లలు చిన్నప్పటి నుండీ ఇంగ్లీషు మీడియంలో చదవకపోతే సరియైన టెర్మినాలజీ, వొక్యాబులరీ రాదు. అపుడు ఎందుకూ పనికిరాడు.
4) ప్రాథమిక స్థాయిలో తెలుగు మీడియం చదివిన వాడు పెదై ్దతే ఏ భాషనైనా నేర్వగలడు.
5) పేదవారి పిల్లలకు ఉన్నత పదవులు, ఉద్యోగాలు రావడం ఇష్టం లేనివారే ఆంగ్లమాధ్యమం వద్దని వాదిస్తారు.
6) ఇంగ్లీషు భాష పుస్తకాలలోనే విజ్ఞానం ఎక్కువగా దొరుకుతుంది.
ఇలాంటివి...  వినిపిస్తున్నాయి. 
ఇలాంటి ప్రశ్నలన్ని  ఎంత తప్పో ఈ పుస్తకంలో సమాధానాలు ఇచ్చారు రచయిత. అంతేకాదు, ఇలాంటి వారందరికీ రచయిత వేసిన ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.  1) ఆంగ్ల మాధ్యమ  బోధన అవసరమని  భావించి వచ్చే మీటింగులకు వచ్చే ఎంత పెద్ద ఉద్యోగులైనా, అధికారులైనా వారంతా పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారేనా? 2) ఇంగ్లీషు మీడియంలో బోధిస్తున్నాం అని చెప్పుకుంటున్న ప్రయివేటు పాఠశాలలు తరగతి గదులలో మాతృభాష ఉపయోగించకుండా బోధించగలరా? 3) చదువంటే ఇంగ్లీషేనని, చదువంటే ర్యాంకులేనని, చదువంటే డాక్టర్లు, ఇంజనీర్లు, ఏంసిఏలే అని అమాయకంగా నమ్మి బలైపోతున్న వాళ్ళు 90శాతం పైగా ఉన్నారని ఎంతమందికి తెలుసు? 4) ఇంగ్లీషు మీడియం పై గ్రామీణ ప్రాంత ప్రజలు ఎందుకంత మోజు చూపుతున్నారు? వాస్తవాలు ఏమిటి?5) ఇంగ్లీషు మీడియంలో చదివిన వారు ఎంతశాతం పెద్ద ఉద్యోగాలు పొందుతున్నారు? 6) ఇంగ్లీషు మీడియంలో చదివి పెద్ద ఉద్యోగాలు, పాలక వర్గాలలో ఉన్న వారు తెలుగు ప్రజలతో ఏమాత్రం వ్యవహరించగలుగుతారు? 7) భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎందుకు ఏర్పడ్డాయి? అని.
ఇంగ్లీషు భాషను వద్దని అనడంలేదు రచయిత. ఏభాషనైనా ద్వేషించడం అనర్ధదాయకమే అంటారు. ఆంగ్లభాషను  ద్వేషించకండి  అన్నారు.  కానీ,  వాస్తవాలు   గ్రహించాలన్నారు. ఆ వాస్తవాలు ఏమిటో?  గ్రహించకపోతే, మున్ముందు తెలుగు అనే మాట వినిపించకుండా పోయే ప్రమాదముంది  అన్నారు. ఆ  ప్రమాదాలేమిటో  ప్రతి తెలుగువారూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మాతృభాష ఉనికిని కాపాడుకునేందుకు ఈ పుస్తకం తప్పకుండా చదివితీరాలి.  
మాతృభాష మన తెలుగు గురించి, మన భాషకున్న విలువ గురించి, దానిపై తెలుగు వారికి ఉండాల్సిన స్ప ృహ గురించి చక్కగా వివరించారు ఇందులో నారాయణ గారు. తెలుగు వారి బాధ్యతలను గూర్చి, మన తెలుగుకు ఆంగ్లమాధ్యమం వలన రాబోయే కాలంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి పుష్కర కాలం నాడేే హెచ్చరించారు సింగమనేని గారు. ఈ ఆంగ్ల మాధ్యమ బోధనా విధానం వెనుక దాగి ఉన్న రాజకీయపు కుట్రలున్నాయన్న వీరు అవేమిటో తెలుసుకోవడానికైనా చదవాలి. మన భాషను మనం కాపాడుకోవాలి. 
  తెలుగు భాషా పరిస్థితి ఇప్పటికే ఎలా ఉందో? ఎలా నలిగి పోతున్నదో? ఈ పుస్తకం చివర ప్రముఖ జాతీయ చిత్రకారుడు, మా మిత్రుడు శ్రీ వెంటపల్లి సత్యనారాయణ గారు వేసిన కార్టూన్‌ చూస్తే తెలుగు ఎంతగా నలిగిపోతున్నదో? తెలుస్తుంది. ఈ చిత్రం చూసిన ఏ తెలుగు వారూ ప్రాథమిక స్థాయిలో ఆంగ్లభాషా మాధ్యమం కావాలని కోరుకోరు. 2015 ఆగష్టు 29న మొదటి ముద్రణకు నోచుకున్న ఈ పుస్తకం ఇప్పటికి మూడవ సారి ఇటీవలే 2019 నవంబరు 30న గురజాడ 104వ వర్ధంతి నాడు ముద్రితమయింది. 
ఎంతో విలువైన సమాచారం ఉన్న ఈ పుస్తక ప్రతులకు ''మైత్రీ బుక్‌ హౌస్‌, జలీల్‌ వీధి, కార్ల్‌మార్క్‌ ్స రోడ్డు, విజయవాడ-520002'' అనే చిరునామాలో గానీ, 9177979622 అనే సెల్‌ఫోన్‌ నెంబరు నందు గానీ, తీaఙఱపaపబయరఏవaష్ట్రశీశీ.షశీ.ఱఅఅనే మెయిల్‌  ద్వారా గానీ, సంప్రదించవచ్చు. 
ప్రస్తుత పరిస్థితుల గురించి ఈ రచయితతో డిబేట్‌లు కూడా నిర్వహించవచ్చు. వీరి ఫోన్‌ నెంబరు కూడా   ఈ పుస్తకంలో ఇవ్వబడింది. పూర్తి వివరాలకు... డా|| బి.అరుణ, ప్రధాన కార్యదర్శి , జనసాహితీ , 30-7-8, అనపర్తి వారి వీధి, అన్నదాన సమాజం రోడ్‌, దుర్గాగ్రహారం, విజయవాడ-520002. సెల్‌:7075957010.

''ప్రపంచంలోని ఏ భాషయైనా పరబాషా సంపర్కం కలిగి ఉండాల్సిందే. మాతృభాషలో మాట్లాడగలిగేంత సౌలభ్యం పరాయి భాష ఎంత నేర్చుకున్నా, అందులో ఉండదు''    dt:10-12-2019