PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Thursday, July 23, 2026

నా టైలరింగ్ గురువు ఖాజావళి కి కృతజ్ఞత

 మా స్వగ్రామము ఆదిమూర్తిపల్లె లో మా ఇంటి వద్ద 1980 ప్రాంతంలో ఖాజావళి అనే ఒక టైలర్ టైలరింగ్ మిషన్ నడుపుకుంటూ ఉండేవాడు. నేను అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. ప్రతిరోజూ స్కూలు నుండి ఇంటికి వచ్చాక మరియు సెలవురోజుల్లో కూడా ఎక్కువగా అతని వద్దే సమయం గడుపుతూ ఉండేవాడిని. క్రమంగా  5 వ తరగతి వచ్చేసరికి నాకు టైలరింగ్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగింది.  అప్పుడు ఆయనను నాకు స్టిచ్చింగ్ నేర్పమని అడిగేవాడిని.. కానీ, ఆయన , నువ్వు చిన్న పిల్లవాడివి, ఇంకొంచెం పెద్ద అవ్వాలి అనేవాడు. కానీ, నేను ఒప్పుకునేవాడిని కాదు. నా కోరిక క్రమంగా అతనిని విసిగించే స్థాయికి చేరింది. అప్పుడు ఆయన నా విసుగు తప్పించుకోవడానికో, ఏమో? మిషన్ నేర్చుకోవాలంటే ముందు చొక్కాలకు కాజాలు, గుండీలు, హెమింగ్ లు ముందు నేర్చుకోవాలి... పైగా నీకు కాళ్ళు అందవు తొక్కడానికి అని చెప్పేవాడు. కానీ, నేను పట్టుదల పట్టి రెండు నెలలు తిరక్కుండానే అవన్నె నేర్చుకుని మరలా మామూలుగా కాస్త ఇబ్బంది పెట్టేవాడిని... ఇలా దాదాపు నాలు తెలిసి నేను 6,7 తరగతులు పూర్తి చేసేనాటికి ఎలాగైతేనేం.. చదివేటప్పుడు అనగా నాకు 12  సంవత్సరాల వయసున్నపుడు  కొంచెం, కొంచెం సెలవు రోజుల్లోనే మిషన్ తొక్కడం..  నేర్చుకున్నాను.. బహుశా తొమ్మిదవ తరగతి వచ్చేనాటికి చొక్కాలు , నిక్కర్లు , జాకెట్స్ కుట్టడం ఆయనను ఇబ్బంది పెడుతూనే నేర్చుకున్నాను.. పూర్తిగా కాదు. 

===== అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు.. నేను నేర్చుకోవాలంటేనే.. 10,15 సంవత్సరాలు పట్టింది. నువ్వు తెలివి గలవాడివయ్యా.. చాలా తొందరగా నేర్చుకున్నావు. చదువు గూడా బాగా చదువుతావు. మిషన్ కూడా నాకంటే బాగా కుట్టగలవు.  నువ్వు పెద్దయ్యాక మంచి ఉద్యోగం కూడా వస్తుంది. అప్పుడు నాకు ఒక ప్యాంటు, చొక్కా నువ్వే కుట్టి ఇవ్వాలి అన్నాడు. అలాగే అన్నాను. 

===== ఉద్యోగ రీత్యా ఆ ఊరునుండి నేను ఇతర ఊర్లలో ఉండవలసి వచ్చింది.. ఆయన జాడ తప్పిపోయింది. నేను దూరం అయ్యాను. 

అదుగో.. ఆ మాటను గుర్తుంచుకుని.. నాకు ఉద్యోగం వచ్చిన స్థిరపడిన నాటి నుండి ఇక ఆయన గురించి మా ఊరు వెళ్ళి అడిగితే తెలియరాలేదు.. కనబడిన వారికందరికీ ఆయన కనబడితే నాకు చెప్పండి.. ఆయనకు బట్టలు పెట్టాలంటూ చెప్పేవాడిని.. చివరికి. ఇదిగో.. ఇలా ఈ సంవత్సరం.. దొరికారు.. తనకు రెండు జతలు, తన శ్రీమతికి ఒక చీర, జాకెట్ , మరికొంత డబ్బు ఇటీవల గురువుగారికి ఉడుతా భక్తిగా.. సమర్పించి..  తృప్తి పడ్డాను.. 




















నా తృప్తికి, ఆయన ఆనందానికి.. అవధుల్లేవు..  "అసలు నేనెప్పుడు బట్టలు అడిగాను.. నాకేం గుర్తు లేదు" అంటూ.. నేనిచ్చిన చిరుకానుకలను, మా ఊరిలో, ఆయన ప్రస్తుతమున్న ఊరిలో కనబడిన వారందరికీ చూపిస్తూ.. నేనిచ్చిన దుస్తులను వేసుకుని మరీ..  వాళ్ళ అబ్బాయి ద్వారా వాట్సాప్ లో మరలా ఈ ఫోటో పంపినాడు.. ఆయన వయసు ప్రస్తుతం.. దాదాపు 68 సంవత్సరాలు.