PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Saturday, April 11, 2026

"మట్టిబండి" పుస్తక సమీక్ష...

 ఏప్రిల్ 2026 న 64kalalu.com వెబ్ పత్రిక లో నేను వ్రాసిన "మట్టిబండి" పుస్తక సమీక్ష...  " మట్టిబండి " పుస్తక సమీక్ష చదవడానికి దీనిపై క్లిక్ చేయండి.


ఐదు సంవత్సరాల కాలంలో ఐదు భాషలలో ముద్రింపబడి, 100 మంది స్పందనలను, విమర్శనాత్మక వ్యాసాలుగా "వరదగుడి" పేరున 305 పేజీలుగా ప్రచురింపబడి ఆదరణ పొందిన   గొప్ప రచన  "మట్టిబండి" (దీర్ఘ కవిత)
========================================================
రచన: భాషావిభ్హూషణ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ
============
సమీక్షకులు : "నవ్యకవితాకళానిధి" మద్దిరాల శ్రీనివాసులు, ఒంగోలు , ఫోన్ : 901019066 
=============
"మట్టిబండి" అనే పేరులోనే... చెప్పకనే ఈ రచన ఒక రైతు గురించి అని తెలిసిపోతున్నది.  కాకపోతే  లోపలికి చూస్తే గానీ, ఇది ఒక భావోద్వేగభరితమైన రైతు దీనస్థితి గురించి అని అర్థమవదు. మట్టిబండి కి, రైతుకు ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో? 42 పేజీల ఒక చక్కని దీర్ఘకవిత ద్వారా అద్భుతంగా ఆవిష్కరింపజేశారు రచయిత.  
ఎవరివైనా రచనలు ప్రారంభంలో ఒక విధంగా, మధ్యలో ఒక విధంగా, ముగింపులో మరో విధముగా ఉంటూ ఉంటాయి. కానీ, ఈ మట్టిబండి దీర్ఘకవిత లో మాత్రం ఆదినారాయణ గారు ఆద్యంతం రైతు జీవితాన్ని సజీవంగా శ్వాసింపజేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పంక్తులను చూస్తే... 
మా పొలాన్ని అమ్మేశాను / చితిని చేరేవరకు/ బతుకులో భాగంగా ఉంటుందని/ భావిస్తూ వచ్చిన పొలాన్ని/భయపడుతూ/బాధపడుతూ అమ్మేశాను.... 
చూడండి..  ఈ పంక్తుల రచనా శైలి నాకైతే.... రామాయణంలోని ఒక మధుర ఘట్టాన్ని గుర్తు తెచ్చింది. సీతమ్మ జాడ కోసం ఆంజనేయస్వామి లంకను దాటి వెళ్ళాడు కదా. అక్కడ అమ్మను చూసిన ఆనందాన్ని తిరిగి రాగానే ఎదురు చూస్తున్న వారితో ఆకాశం నుండి కిందకు రాకముందే, "చూశాను" అన్నాడట. అంటే విషయం అర్థమైపోయింది. అందరూ ఆనందపడ్డారు. ఆ తరువాత జరిగిన పూర్తి విషయం కూలంకషంగా వివరించాడు.
అదేవిధముగా, ఇక్కడ కూడా రచయిత, "మా పొలాన్ని అమ్మేశాను" అని మొదలుపెట్టి, ఆ నిర్ణయపు వేదనను మలి పదాలలో విప్పి చెబుతూ  రామాయణ ఘట్టాన్ని స్మరింపజేశారు. రచనా శైలి ఒక మచ్చు తునకైతే, దానిని ఎందుకు అమ్మేశాడో చెప్పిన విధానం రైతు ఆర్తిని పాఠకుల హృదయాల్లో కన్నీటి తరంగాలుగా మలుస్తుంది.
మరోచోట, " ఎత్తయిన మూపురాలు /రాజసం కనిపించే నడకలు / నడకకు లయబద్ధంగా ఊగే గంగడోళ్ళు / కాటుక దిద్దినట్లున్న కళ్ళు/ ఎంత అందంగా, హుందాగా ఉండేవో" . "ఒంగోలు జాతి ఎడ్లు కదా!" అని ముగింపు పలికే వేళ, ఆ ఎడ్ల సౌందర్యాన్ని మాత్రమే కాదు, రైతు మనసులోని మమకారాన్ని కూడా సజీవంగా చిత్రిస్తారు. ప్రతి పదం ఒక దృశ్యమై, మన కళ్ల ముందు నాట్యం చేస్తుంది. ఇది శ్రీనాధ మహాకవి వర్ణనా వైభవాన్ని తలపిస్తుంది.. 
ఇదొక్క కవితే కాదు... పుస్తకమంతా అద్భుతమైన వర్ణనల ప్రవాహంగా సాగుతుంది. ఒకసారి ఈ పుస్తకాన్ని తెరిచిన పాఠకుడు, ఆద్యంతం లీనమై, పరకాయ ప్రవేశం చేయక మానడు అని ధైర్యంగా చెప్పగలను.

ఇంకో చోట "రైతుబంధు రంగ / మా ఊరు వచ్చినప్పుడు / ఈ బండి మీదనే ఎక్కించి / ఊరేగించి, సత్కరించాం" అన్న పంక్తుల్లో, బండి జ్ఞాపకాల్లో రైతు కన్నీళ్లలో ఆనందభాష్పాల మెరుపులు కరిగిపోతాయి. ఆ అనుభూతి పాఠకుడి హృదయానికీ చేరుతుంది.
"గొడ్లు కాసుకునే బుడ్డోళ్ళు..." అంటూ బాల్యపు ఆహ్లాదాన్ని, దర్పాన్ని, అమాయకత్వాన్ని మదపుటేనుగు, ఐరావతంతో పోల్చిన తీరు—దీనస్థితిలోనూ చిలిపితనాన్ని కోల్పోని జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
"కూటిని చల్లతో కలగలిపి..." అంటూ తాతగారి సాదాసీదా భోజనానుభవాన్ని "మోహిని చేతి భాండం నుండి జాలువారే అమృతం"తో పోల్చిన తీరు భాగవత, విష్ణుపురాణాల సుగంధాన్ని వెదజల్లుతుంది. ఇది కవిత కాదనిపించేంత సహజానుభవం.
పురాణపరిజ్ఞానం, సాహిత్యాస్వాదన, రైతుబిడ్డగా జీవించిన అనుభవం—ఈ మూడు కలిసినపుడే ఇలాంటి కవిత జన్మిస్తుంది. అందుకే ఈ దీర్ఘకవిత ఆద్యంతం రక్తికట్టింది. ఊహకు అందని నిజజీవితం ఇక్కడ పలికింది.
ఇందులో రైతు జీవితం మాత్రమే కాదు—అక్కతమ్ముళ్ళ అనుబంధం, పల్లె వైద్యం, గడ్డివాములు, పంట నూర్పిడి, బాల్యపు ఆటలు, జంతువులతో మమకారం—అన్నీ కలగలిసి నవరసభరిత కావ్యంగా వికసించాయి.
తరాలు మారినా రైతు జీవితం మాత్రం "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లే ఉందని ఈ కవిత మనకు చెబుతుంది. ఇది వాస్తవం కూడా కదా! ఇతర వృత్తులవారు తమ కూలీని తామే నిర్ణయించుకోగలిగినా, రైతుకు మాత్రం తన పంటకు ధర నిర్ణయించే హక్కు లేకపోవడం బాధాకరం. ఈ విషాదాన్ని అభిమన్యుని పోరాటంతో పోల్చిన తీరు సార్థకం.
ఈ నవరసభరిత రచన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నా, పెద్ద అందరూ చదవాల్సిన గ్రంథం. తక్కువ కాలంలోనే మూడు ముద్రణలు పొందిన ఈ రచన, తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళ భాషల్లో వెలుగొందుతూ, త్వరలో కన్నడలోనూ వికసించబోతోంది. ఇదే "మట్టిబండి" శక్తి. ముఖచిత్రాన్ని చంద్రమోహన్ గారు చక్కగా ఆవిష్కరించారు.
ప్రముఖ రచయిత, ప్రకాశం జిల్లా గీతరచయిత శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు గారి సోదరుడు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారి అద్భుత ఆవిష్కరణయైన ఈ రచన గూర్చి, ముందుమాటలలో రచయితతో పాటు మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి గారు, ప్రముఖ వక్త, రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకులు డాక్టర్ బీరం సుందరరావు గారు, ఎం.పి. శ్రీ గల్లా జయదేవ్ గారు, ఎన్.జి.రంగ ఫౌండేషన్ డాక్టర్ జక్కంపూడి సీతారామారావు గారు, సరస్వతీ పుత్ర, కళారత్న డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గార్లు అందించిన అద్భుతమైన వ్యాఖ్యలు మణిమకుటాలవంటివి. కాగా,
మరొక గొప్ప విశేషమేమంటే, ఈ పుస్తకం ముద్రింపబడిన అతి తక్కువ కాలంలో ఎందరో పెద్దలు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, సాహితీ ప్రముఖులు, రచయితలు, విమర్శకులు, గురువులు, రచయిత ఆప్తమిత్రులు, శిష్యులు, అపరిచితులు, అభిమానులు, సహాధ్యాయులు, పత్రికల వారు , నాతో కలిపి 100 మంది చేత సుదీర్ఘమైన విశ్లేషనాత్మక సమీక్షలు రావడం నభూతో న భవిష్యత్.. పైగా వాటన్నిటినీ క్రోడీకరించి "వరదగుడి" పేరుతో ఆదినారాయణ మాష్టారు 305 పేజీల పుస్తకంగా కూడా ముద్రించడం నిజంగా విశేషమే..కదా.  42  పేజీల రచనకు 300 పేజీల సమీక్షలు.. బాప్ రే.. 
ఏ పాఠకుడినైనా ఏకబిగిన చదివించే ఈ పుస్తకాన్ని ఎన్.జి.రంగ ఫౌండేషన్, గుంటూరు వారు జనవరి 2024లో తృతీయ ముద్రణగా 500 కాపీలుగా అందుబాటులోకి తెచ్చారు. కావలసిన వారు
1. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, 202, శ్రీ వెంకటసాయి రెసిడెన్సీ, 2వ లైను, రామయ్యనగర్, ఒంగోలు-2, ప్రకాశం జిల్లా, ఫోన్: 98497 99711 (మరియు )
2. శ్రీ ఏనుగు అంకమనాయుడు, 18, ఎమ్.కె.నాయుడు కాలనీ, తిరుపతి - 517 501, ఫోన్: 8919676459 వద్ద నుండి పొందవచ్చును.
================= 
మీ "నవ్యకవితాకళానిధి" మద్దిరాల శ్రీనివాసులు, ఒంగోలు.