తేది:16-04-2026 న, 64kalalu.com. లో తెలంగాణ రాష్త్రం లోని ఖమ్మం జిల్లా ఖమ్మం డి.టి.ఓ. , ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ వెంటపల్లి సత్యనారాయణ గారు అందించిన నా రచన "మహంతీరాజ్యం" అనే కథల సంపుటి పై సమీక్ష
https://64kalalu.com/mahanthi-rajyam-story-book-review/
మన తెలుగు రాష్ట్రాల్లో బాల సాహిత్యంపై విరివిగా రచనలు చేస్తున్న ప్రముఖ రచయితల్లో మద్దిరాల శ్రీనివాస్ గారు ఒకరు. ఉపాధ్యాయుడుగా ఆయన తమ విద్యార్థులకు ఆదర్శమైన విద్యాబోధన చేస్తూనే విద్యార్థులలో విజ్ఞాన వికాసాలతో బాటు నీతి ప్రభోదకంగా బాల సాహిత్యం పై సుమారు 20 కి పైగా రచనలు చేసారు, వారి కలం నుండి వెలువడిన మరో బాలల కదా సంకలనం మహంతి రాజ్యం. పదునాలుగు చిన్న కధలతో వెలువడిన ఈ గ్రంధంలో ‘మహంతి రాజ్యం’ అన్నది ఈ సంకలనంలో ఒక కథ పేరు మాత్రమే. ఈ సంకలనం నందలి కదల గురించి క్లుప్తంగా వివరిస్తాను.
లక్ష్యసాధనలో నిస్స్వార్ధంగా ఒకరుకొకరు సహకరించుకోవడమే నిజమైన త్యాగమని చెప్పడానికి ఉదాహరణగా ఒక అందమైన బొమ్మ రూప కల్పనకోసం అరిగిపోతున్న పెన్సిల్ ను చూసి ఎరేజర్. ఆ బొమ్మలోని తప్పులను సరిచేసే క్రమంలో అరిగిపోతున్న ఎరేజర్ని చూసి ఆ బొమ్మను గీస్తున్న పెన్సిల్ ఒకదాని త్యాగాన్ని ఒకటి మెచ్చుకోవడాన్ని నిజమైన త్యాగంగా కధలో చెప్పినపోలిక నిజంగా ఎంతో సందేశాత్మకంగా ఉంది.
పాటశాలలో తోటి పిల్లలు ప్రతి రోజూ యేవో తినుబండారాలు కొనుక్కుని తింటున్డడం గమనించిన కనకయ్య తన పిల్లలైన రేఖ, మనోజ్ లకు కూడా తనకున్నంతలో తినడానికి ఇచ్చిన డబ్బులు తమ కుటుంభ స్థితి ననుసరించి ఖర్చు చేయకుండా ఆ పిల్లలిద్దరూ ఒక కుండలో దాచుకున్న డబ్బు అనారోగ్యంకి గురయ్యిన సందర్భంలో తమ తండ్రి ఆపరేషన్ కి ఎలా ఉపయోగపడ్డాయో పొదుపు నిలిపిన ప్రాణం కథలో చక్కగా చెబుతారు.
తాగుడికి బానిసైన రాజన్న ప్రవర్తన వలన పాటశాలలో మొరటుగా కంటకుడిగా మారిన తన కొడుకు విజయ్ లో ఆదర్శ వంతుడైన ఉపాధ్యాయుడి బోధన ఎలా మార్పు తెచ్చింది. ఆ మార్పు తర్వాత రాజన్నలో అతని కుటుంభంలో కూడా ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో తెలియజెప్పే కథ “వెలుగు కిరణాలు”. కుటుంబంలో పెద్దవాళ్ళ సహవాసం చిన్న పిల్లలలో ఎంతటి మంచి మార్పు తీసుకువస్తుందో చెబుతూ కుటుంబంలో తాతయ్య నానమ్మల గొప్పతనాన్ని బాలలకు తెలియజేసే కద వృద్ధుల విలువ చెట్ల పెంపకం ద్వారా భావితరాలకు వచ్చే విలువను తెలియజేస్తారు స్వీయ అనుభవం అనే మరో కధలో మంచి చెప్పిన కోడి మాట వినని పిల్లి పిల్లకు ఎదురైన చేదు అనుభవాన్ని “మంచి ఎవరు చెప్పినా వినాలి” అనే కథలో వివరిస్తారు.
చుట్టు ప్రక్కల ఉన్నతోటి వారి ఇబ్బందిని అర్ధం చేసుకోకుండా నాకెవరు ఎదురు చెప్పేది అన్న శివాచారి అహంకారం చివరికి తన మనవడీ చూపు కోల్పోడానికి దారి తీసిన ఘటన అతనిలో ఎలా మార్పును తీసుకు వచ్చిందో “చిత్రిక గుల్ల” అనే కధలో చూస్తాము.
ప్రజా సంక్షేమమం పేరుతో రాజు పరిమితికి మించి ఉచితాలు ప్రజలకు అలవాటు చేస్తే వచ్చిన దుష్పరినామాలను విద్యావంతుడైన యువరాజు అధికారం చేబట్టిన తర్వాత ప్రజలకు పని కల్పించడం ద్వారా తన తండ్రి ఉచిత పధకాలద్వారా దివాలా తీసిన రాజ్య సంపదను తిరిగి సిరి సంపదలతో సుభిక్షంగా ఎలా మార్చాడో “మహంతి రాజ్యం” అన్న కధలో చక్కగా వివరించారు.
ఇంకా ఈ పుస్తకంలో మారిన సిద్దు. ఆశావాద దృక్పదం, కృతజ్ఞత, కలం తెచ్చిన మార్పు, పగ బట్టిన పాము లాంటి మొత్తం 14 కథలున్నాయి. ప్రతి కథ కూడా ఎదో ఒక చక్కటి సందేశం పిల్లలలో రేకెత్తించే విదంగా ఉన్న ఈ కథలకు రచయిత తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ మేథను ఉపయోగించుకుని సందర్భోచితమైన చిత్రాలను కూడా ప్రతి కథకు జత చేయడం అదనపు ఆకర్షణగా ఉంది.
ప్రతి విద్యార్ధిలో చక్కని నీతి నియమాలతో బాటు చక్కటి ఆలోచన, ఆచరణ, శాస్త్రీయ ధృక్పదాలను పెంపొందించే ఈ గ్రంధం విద్యార్ధులకు మంచి ఉపయుక్తమైనది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
14 కధలతో నిండిన ఈ 84 పేజీల గ్రంధం వెల. 120/- రూపాయలు. దీనిని సొంతంతం చేసుకోవడానికి సంప్రదించ వలసిన రచయిత మద్దిరాల శ్రీనివాసు గారి చరవాణి నంబర్ – 90106 19066
–వెంటపల్లి సత్యనారాయణ (94913 78313)