PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Saturday, April 11, 2026

"మట్టిబండి" పుస్తక సమీక్ష...

 ఏప్రిల్ 2026 న 64kalalu.com వెబ్ పత్రిక లో నేను వ్రాసిన "మట్టిబండి" పుస్తక సమీక్ష...  " మట్టిబండి " పుస్తక సమీక్ష చదవడానికి దీనిపై క్లిక్ చేయండి.


ఐదు సంవత్సరాల కాలంలో ఐదు భాషలలో ముద్రింపబడి, 100 మంది స్పందనలను, విమర్శనాత్మక వ్యాసాలుగా "వరదగుడి" పేరున 305 పేజీలుగా ప్రచురింపబడి ఆదరణ పొందిన   గొప్ప రచన  "మట్టిబండి" (దీర్ఘ కవిత)
========================================================
రచన: భాషావిభ్హూషణ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ
============
సమీక్షకులు : "నవ్యకవితాకళానిధి" మద్దిరాల శ్రీనివాసులు, ఒంగోలు , ఫోన్ : 901019066 
=============
"మట్టిబండి" అనే పేరులోనే... చెప్పకనే ఈ రచన ఒక రైతు గురించి అని తెలిసిపోతున్నది.  కాకపోతే  లోపలికి చూస్తే గానీ, ఇది ఒక భావోద్వేగభరితమైన రైతు దీనస్థితి గురించి అని అర్థమవదు. మట్టిబండి కి, రైతుకు ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో? 42 పేజీల ఒక చక్కని దీర్ఘకవిత ద్వారా అద్భుతంగా ఆవిష్కరింపజేశారు రచయిత.  
ఎవరివైనా రచనలు ప్రారంభంలో ఒక విధంగా, మధ్యలో ఒక విధంగా, ముగింపులో మరో విధముగా ఉంటూ ఉంటాయి. కానీ, ఈ మట్టిబండి దీర్ఘకవిత లో మాత్రం ఆదినారాయణ గారు ఆద్యంతం రైతు జీవితాన్ని సజీవంగా శ్వాసింపజేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పంక్తులను చూస్తే... 
మా పొలాన్ని అమ్మేశాను / చితిని చేరేవరకు/ బతుకులో భాగంగా ఉంటుందని/ భావిస్తూ వచ్చిన పొలాన్ని/భయపడుతూ/బాధపడుతూ అమ్మేశాను.... 
చూడండి..  ఈ పంక్తుల రచనా శైలి నాకైతే.... రామాయణంలోని ఒక మధుర ఘట్టాన్ని గుర్తు తెచ్చింది. సీతమ్మ జాడ కోసం ఆంజనేయస్వామి లంకను దాటి వెళ్ళాడు కదా. అక్కడ అమ్మను చూసిన ఆనందాన్ని తిరిగి రాగానే ఎదురు చూస్తున్న వారితో ఆకాశం నుండి కిందకు రాకముందే, "చూశాను" అన్నాడట. అంటే విషయం అర్థమైపోయింది. అందరూ ఆనందపడ్డారు. ఆ తరువాత జరిగిన పూర్తి విషయం కూలంకషంగా వివరించాడు.
అదేవిధముగా, ఇక్కడ కూడా రచయిత, "మా పొలాన్ని అమ్మేశాను" అని మొదలుపెట్టి, ఆ నిర్ణయపు వేదనను మలి పదాలలో విప్పి చెబుతూ  రామాయణ ఘట్టాన్ని స్మరింపజేశారు. రచనా శైలి ఒక మచ్చు తునకైతే, దానిని ఎందుకు అమ్మేశాడో చెప్పిన విధానం రైతు ఆర్తిని పాఠకుల హృదయాల్లో కన్నీటి తరంగాలుగా మలుస్తుంది.
మరోచోట, " ఎత్తయిన మూపురాలు /రాజసం కనిపించే నడకలు / నడకకు లయబద్ధంగా ఊగే గంగడోళ్ళు / కాటుక దిద్దినట్లున్న కళ్ళు/ ఎంత అందంగా, హుందాగా ఉండేవో" . "ఒంగోలు జాతి ఎడ్లు కదా!" అని ముగింపు పలికే వేళ, ఆ ఎడ్ల సౌందర్యాన్ని మాత్రమే కాదు, రైతు మనసులోని మమకారాన్ని కూడా సజీవంగా చిత్రిస్తారు. ప్రతి పదం ఒక దృశ్యమై, మన కళ్ల ముందు నాట్యం చేస్తుంది. ఇది శ్రీనాధ మహాకవి వర్ణనా వైభవాన్ని తలపిస్తుంది.. 
ఇదొక్క కవితే కాదు... పుస్తకమంతా అద్భుతమైన వర్ణనల ప్రవాహంగా సాగుతుంది. ఒకసారి ఈ పుస్తకాన్ని తెరిచిన పాఠకుడు, ఆద్యంతం లీనమై, పరకాయ ప్రవేశం చేయక మానడు అని ధైర్యంగా చెప్పగలను.

ఇంకో చోట "రైతుబంధు రంగ / మా ఊరు వచ్చినప్పుడు / ఈ బండి మీదనే ఎక్కించి / ఊరేగించి, సత్కరించాం" అన్న పంక్తుల్లో, బండి జ్ఞాపకాల్లో రైతు కన్నీళ్లలో ఆనందభాష్పాల మెరుపులు కరిగిపోతాయి. ఆ అనుభూతి పాఠకుడి హృదయానికీ చేరుతుంది.
"గొడ్లు కాసుకునే బుడ్డోళ్ళు..." అంటూ బాల్యపు ఆహ్లాదాన్ని, దర్పాన్ని, అమాయకత్వాన్ని మదపుటేనుగు, ఐరావతంతో పోల్చిన తీరు—దీనస్థితిలోనూ చిలిపితనాన్ని కోల్పోని జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
"కూటిని చల్లతో కలగలిపి..." అంటూ తాతగారి సాదాసీదా భోజనానుభవాన్ని "మోహిని చేతి భాండం నుండి జాలువారే అమృతం"తో పోల్చిన తీరు భాగవత, విష్ణుపురాణాల సుగంధాన్ని వెదజల్లుతుంది. ఇది కవిత కాదనిపించేంత సహజానుభవం.
పురాణపరిజ్ఞానం, సాహిత్యాస్వాదన, రైతుబిడ్డగా జీవించిన అనుభవం—ఈ మూడు కలిసినపుడే ఇలాంటి కవిత జన్మిస్తుంది. అందుకే ఈ దీర్ఘకవిత ఆద్యంతం రక్తికట్టింది. ఊహకు అందని నిజజీవితం ఇక్కడ పలికింది.
ఇందులో రైతు జీవితం మాత్రమే కాదు—అక్కతమ్ముళ్ళ అనుబంధం, పల్లె వైద్యం, గడ్డివాములు, పంట నూర్పిడి, బాల్యపు ఆటలు, జంతువులతో మమకారం—అన్నీ కలగలిసి నవరసభరిత కావ్యంగా వికసించాయి.
తరాలు మారినా రైతు జీవితం మాత్రం "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లే ఉందని ఈ కవిత మనకు చెబుతుంది. ఇది వాస్తవం కూడా కదా! ఇతర వృత్తులవారు తమ కూలీని తామే నిర్ణయించుకోగలిగినా, రైతుకు మాత్రం తన పంటకు ధర నిర్ణయించే హక్కు లేకపోవడం బాధాకరం. ఈ విషాదాన్ని అభిమన్యుని పోరాటంతో పోల్చిన తీరు సార్థకం.
ఈ నవరసభరిత రచన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నా, పెద్ద అందరూ చదవాల్సిన గ్రంథం. తక్కువ కాలంలోనే మూడు ముద్రణలు పొందిన ఈ రచన, తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళ భాషల్లో వెలుగొందుతూ, త్వరలో కన్నడలోనూ వికసించబోతోంది. ఇదే "మట్టిబండి" శక్తి. ముఖచిత్రాన్ని చంద్రమోహన్ గారు చక్కగా ఆవిష్కరించారు.
ప్రముఖ రచయిత, ప్రకాశం జిల్లా గీతరచయిత శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు గారి సోదరుడు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారి అద్భుత ఆవిష్కరణయైన ఈ రచన గూర్చి, ముందుమాటలలో రచయితతో పాటు మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి గారు, ప్రముఖ వక్త, రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకులు డాక్టర్ బీరం సుందరరావు గారు, ఎం.పి. శ్రీ గల్లా జయదేవ్ గారు, ఎన్.జి.రంగ ఫౌండేషన్ డాక్టర్ జక్కంపూడి సీతారామారావు గారు, సరస్వతీ పుత్ర, కళారత్న డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గార్లు అందించిన అద్భుతమైన వ్యాఖ్యలు మణిమకుటాలవంటివి. కాగా,
మరొక గొప్ప విశేషమేమంటే, ఈ పుస్తకం ముద్రింపబడిన అతి తక్కువ కాలంలో ఎందరో పెద్దలు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, సాహితీ ప్రముఖులు, రచయితలు, విమర్శకులు, గురువులు, రచయిత ఆప్తమిత్రులు, శిష్యులు, అపరిచితులు, అభిమానులు, సహాధ్యాయులు, పత్రికల వారు , నాతో కలిపి 100 మంది చేత సుదీర్ఘమైన విశ్లేషనాత్మక సమీక్షలు రావడం నభూతో న భవిష్యత్.. పైగా వాటన్నిటినీ క్రోడీకరించి "వరదగుడి" పేరుతో ఆదినారాయణ మాష్టారు 305 పేజీల పుస్తకంగా కూడా ముద్రించడం నిజంగా విశేషమే..కదా.  42  పేజీల రచనకు 300 పేజీల సమీక్షలు.. బాప్ రే.. 
ఏ పాఠకుడినైనా ఏకబిగిన చదివించే ఈ పుస్తకాన్ని ఎన్.జి.రంగ ఫౌండేషన్, గుంటూరు వారు జనవరి 2024లో తృతీయ ముద్రణగా 500 కాపీలుగా అందుబాటులోకి తెచ్చారు. కావలసిన వారు
1. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, 202, శ్రీ వెంకటసాయి రెసిడెన్సీ, 2వ లైను, రామయ్యనగర్, ఒంగోలు-2, ప్రకాశం జిల్లా, ఫోన్: 98497 99711 (మరియు )
2. శ్రీ ఏనుగు అంకమనాయుడు, 18, ఎమ్.కె.నాయుడు కాలనీ, తిరుపతి - 517 501, ఫోన్: 8919676459 వద్ద నుండి పొందవచ్చును.
================= 
మీ "నవ్యకవితాకళానిధి" మద్దిరాల శ్రీనివాసులు, ఒంగోలు.



"బహుమతుల కాకి" పుస్తక సమీక్ష

 మార్చి2026  నెలలో 64kalalu.com వెబ్ పత్రికలో నేను వ్రాసిన "బహుమతుల కాకి" పుస్తక సమీక్ష

బహుమతుల కాకి పుస్తక సమీక్ష                                                     


విలువలు – విజ్ఞానం – వినోదం కలగలిపిన బాలసాహిత్య రత్నం “బహుమతుల కాకి” కథా సంపుటి.

నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లల దృష్టి ఎక్కువగా తెరలపైనే కేంద్రీకృతమవుతున్నది. అలాంటి ఈ కాలంలో, మంచి పుస్తకం చేతిలో పడితే వారి ఊహాశక్తి, ఆలోచనా ధోరణి, భావోద్వేగాలు, పిల్లల సున్నితత్వం మరింత వికసిస్తాయి. అలాంటి పఠనానుభూతిని అందించే బాలల కథాసంపుటి “బహుమతుల కాకి”. నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న విజ్ఞాన ప్రచురణల వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. బాలల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్న కథా రచయిత “టి.వి. రామకృష్ణ గారు” ఈ సంకలనంలో మొత్తం 15 కథలను అందించారు. డిసెంబర్ 2025లో తొలి ముద్రణగా 1000 ప్రతులు వెలువడటం ఈ పుస్తకంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.

ఈ కథాసంపుటి ప్రత్యేకత ఏమిటంటే – ప్రతి కథలో వినోదం వెనుక ఒక విలువ దాగి ఉంటుంది; ప్రతి సంఘటన వెనుక ఒక జీవనపాఠం నిలుస్తుంది. ఉపదేశాత్మక ధోరణి కాకుండా, అనుభూతి ద్వారా పిల్లలకు సందేశాన్ని అందించడం అనేది ఈ రచయిత నైపుణ్యం.

ప్రకృతి – స్నేహం – మనసుల మమకారం
“బహుమతుల కాకి” అనే తొలి కథలో చిన్నారి మేఘన మరియు ఒక కాకి మధ్య ఏర్పడిన అమాయక స్నేహాన్ని హృద్యంగా ఆవిష్కరింపజేశారు. ప్రకృతితో మమేకమవడం, జీవరాశుల పట్ల కరుణ చూపడం, నిరీక్షణలోని ప్రేమ – ఇవన్నీ కథలో సహజంగా అనిపిస్తాయి. పిల్లలు చదివేటప్పుడు తాము కూడా ఆ చెట్టు క్రింద కూర్చున్నట్టుగా అనుభూతి చెందుతారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

“అభయ్ ఆలోచన”, “మధులిక పుట్టినరోజు” వంటి కథలు ప్రకృతి, పల్లె జీవన వాతావరణం, జంతు–పక్షుల ప్రపంచం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి. ఈ కథలు పిల్లలలో పరిశీలనా దృష్టిని పెంచుతాయి.

విజ్ఞాన ప్రేరణ – సృజనాత్మక దిశ
“ఆకాశంలో పక్షులు – జంతువులు” కథ ఖగోళ విజ్ఞానంపై ఆసక్తిని కలిగిస్తుంది. తాతయ్య ఇచ్చిన టెలిస్కోప్ ఒక సాధారణ బహుమతి మాత్రమే కాదు – అది చిన్నారులలో  జ్ఞానాన్వేషణకు పునాది వేస్తుంది.

“కృత్రిమ మేధా” కథలో భవిష్యత్ విద్యావిధానాల రూపురేఖలను రచయిత చక్కగా ఊహించారు. ఇందులో  సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు భయపెట్టే విధంగా కాకుండా, నేర్చుకోవడానికి ఉపకరించే సాధనంగా చూపించడం ప్రశంసనీయం.

ధైర్యం – వ్యక్తిత్వ వికాసం
“పప్పు సాహసం” కథ స్నేహం, ధైర్యం, సమయస్ఫూర్తి విలువలను బలంగా ప్రతిపాదిస్తుంది.
“మార్పు కోరిన కాలుడు” కథ ఇతరులను అనుకరించాలనే కోరిక వెనుక ఉన్న అపోహలను చెదరగొట్టి, స్వీయ సామర్థ్యాన్ని గుర్తించుకోవాలని సూచిస్తుంది.

“విరబూసిన బంతి చెట్టు” కథలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించేందుకు రచయిత ప్రయత్నించారు. శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ అభిప్రాయాన్ని కథలో సున్నితంగా మేళవించి చెప్పడం చాలా బాగా అనిపించింది.

చరిత్ర – సంస్కృతి – కుటుంబ విలువలు
“దుర్గాబాయి” కథ ద్వారా దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవిత స్ఫూర్తిని పరిచయం చేశారు. చిన్నారులకి చరిత్రను భారంగా కాకుండా ప్రేరణాత్మకంగా అందించడం అభినందనీయం.

“క్షీరసాగర మథనం” కథ పురాణ గాథను బాలల భాషలో సరళంగా వివరిస్తుంది.
“చంటిగాడు” కథ కుటుంబ జీవనంలోని అల్లరిని, అనుబంధాన్ని ముద్దుగా చూపిస్తుంది.

రూపకల్పన ప్రత్యేకత
ఈ పుస్తకంలోని ప్రతి కథకు జతచేసిన ఆకర్షణీయమైన ఏఐ చిత్రాలు కథానుభూతిని మరింత సజీవంగా మారుస్తాయి. చిత్రాలు పిల్లల ఊహాశక్తిని విస్తరింపజేస్తాయి. భాష సరళంగానూ,  వాక్య నిర్మాణం సూటిగా సులభ గ్రాహ్యంగానూ ఉన్నది. మంచి చక్కటి పిల్లలకు ఆకషణీయమైన రీతిలో చక్కటి ముఖచిత్రాన్ని కూడా అందించారు. రంగు కూడా ప్రకృతిని సూచించేలా ఉన్నది.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, “బహుమతుల కాకి” కేవలం కథల సంకలనం కాదు; అది పిల్లల మనసుల్లో విలువల విత్తనాలు నాటే పుస్తకం. ప్రకృతి ప్రేమ, విజ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబ అనుబంధం – ఇవన్నీ ఒకే గ్రంథంలో సమన్వయమై ఉండటం ఇందులోని విశేషం.

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పఠనానుభూతి అందించాలనుకుంటే, ఉపాధ్యాయులు తమ పిల్లలను మంచి విజ్ఞానదాయకులుగా రూపుదిద్దాలనుక్కున్నా..  గ్రంథాలయంలో చేర్చదగిన మంచి పుస్తకం కోసం వెతుకుతుంటే – “బహుమతుల కాకి” సరైన ఎంపిక.

ఈ పుస్తకం ధర కేవలము రూ.120/- మాత్రమే. పుస్తకాన్ని పొందదలచిన వారు సంప్రదించవలసిన చిరునామా: జి. మాల్యాద్రి
విజ్ఞాన ప్రచురణలు,
ప్రజా సైన్స్ వేదిక ప్రచురణల విభాగం
162, విజయలక్ష్మీ నగర్, నెల్లూరు – 524004
సెల్: 9440503061

చిన్నారుల చేతిలో మంచి పుస్తకం ఉంటే – వారి భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుంది. ఆ ప్రకాశానికి ఒక చిన్న దీప్తి “బహుమతుల కాకి”.
……………….
సమీక్ష : “నవ్యకవితాకళానిధి” మద్దిరాల శ్రీనివాసులు
ఉపాధ్యాయుడు, రచయిత (cell:9010619066)



డా.వంశీకృష్ణ గారితో

 తేది:08-04-2026, బుధవారము డా.వంశీకృష్ణ గారికి నా తాజా రచన "బాలల ప్రపంచం" పుస్తకాన్ని అందజేస్తూ




ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర & ప్రముఖ బాలసాహిత్య రచయిత VR శర్మ గార్లతో

 ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర & ప్రముఖ బాలసాహిత్య రచయిత VR శర్మ గార్లతో తేది:07-04-2026, మంగళవారము సాయంత్రం ఒంగోలు లోని మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్ ఆవరణలో గడిపిన మధుర క్షణాలు. అమరేంద్ర గారి నూతన రచన "రస్కిన్ బాండ్" ఆత్మకథ అనువాద పుస్తకం (ఓ ఏకాంతజీవి బ్రతుకాట) గురించిన కబుర్లతో.. డాక్టర్ CA ప్రసాద్ గారి ఆధ్యర్యంలో జరిగినది.