PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Sunday, August 22, 2010

ప్రజాశక్తి లో నా కథ

దయ్యం(కథ) రచన: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్, త్రిపురాంతకం
చిన్నారి డెస్కు, ప్రజాశక్తి Sat, 5 Jun 2010, IST కథ
చిట్టిపల్లె గ్రామంలోని శరత్‌, శ్రావణ్‌ ఇద్దరూ ఇరుగూపొరుగూ పిల్లలు. నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే వున్న సింగంపల్లెలోని ఉన్నత పాఠశాలలో శరత్‌ 8వ తరగతి, శ్రావణ్‌ 7వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మంచిమిత్రులు. ఏ పనిచేసినా, ఎక్కడికెళ్లినా దాదాపు కలిసే వుంటారు. వాళ్లిద్దరిలో శ్రావణ్‌ చాలా తెలివైనవాడూ, చురుకైనవాడు. కానీ, కాస్త దుడుకు స్వభావం కలవాడు. శరత్‌ మాత్రం చాలా నెమ్మదస్తుడు. తెలివితో పాటు ఏ విషయాన్నైనా నిదానంగా, తార్కికంగా, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేవాడు. ధైర్యం కూడా కాస్త ఎక్కువే.
ఒకరోజు వాళ్ల పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఆసక్తిగలిగిన మరి కొందరు విద్యార్థులతో కలిసి నాగార్జునసాగర్‌ విహారయాత్రకు వెళ్లారు. వారిలో వీళ్ళిద్దరు కూడా వున్నారు. సాయంత్రం వచ్చేసరికి సూర్యాస్తమయం అయ్యింది. అయినా కాస్త వెలుతురు వుండడంతో చీకటిపడేలోపు పిల్లలను త్వరగా ఇళ్లకు చేరమని చెప్పి, ఉపాధ్యాయులంతా వెళ్లిపోయారు. కానీ, శరత్‌, శ్రావణ్‌ ఇద్దరూ సాగర్‌ విషయాల గురించి చర్చించుకుంటూ నిదానంగా నడవసాగారు. ఇంతలో చీకటిపడ్డ విషయాన్ని గమనించి, వెన్నెల వెలుతురులో వడివడిగా నడవసాగారు. వాళ్ల ఊరు నలభై అడుగుల దూరంలో వుండగా శ్రావణ్‌కు అనుకోకుండా దారిపక్క చింతచెట్టు వైపు చూపుమళ్లింది. వెంటనే ''అమ్మో! దెయ్యం!'' అంటూ శరత్‌ను గట్టిగా పట్టుకున్నాడు. ''ఎక్కడరా?'' అన్నాడు శరత్‌. ''అదిగో! అక్కడ. చూడు'' అంటూ చింత చెట్టుపైకి చూపించాడు.
అక్కడ రెండు చేతులతో కొమ్మలు పట్టుకొని వ్రేలాడుతూ నల్లని ఆకారం ఊగుతూ కనపడింది. తెల్లని కళ్లు మెరుస్తూ వున్నాయి. కనుగుడ్లు మాత్రం లేవు. కానీ, శరత్‌ ఏమాత్రం భయపడకుండా ఒక్కసారి కిందకు పరికించి చూశాడు. కిందివైపు ఒక తోకలాగా వుంది. ఎప్పుడో బడిలో సైన్సుమాష్టారు 'చీకటిలో దేనినైనా చూసినపుడు మన మనసులో ఏదైనా ఆకారాన్ని ఊహించుకుంటే, ఆ ఆకారమే మనకు కనపడుతుంది తప్ప, ఈ దెయ్యాలూ, భూతాలూ వుంటాయని చెప్పేదంతా నమ్మరాదని' చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే శ్రావణ్‌కు ఆ విషయం వివరించి, ధైర్యం చెప్పాడు. 'ఏం భయం లేదు. నాతో రా!' అంటూ శ్రావణ్‌ను పట్టుకొని నెమ్మదిగా అటు చూడకుండా ఇంటికి చేరారు.
ఇంటికి చేరిన వెంటనే శ్రావణ్‌ వాళ్ళ అమ్మకు విషయం చెప్పి, భయంతో 'నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా!' అంటూ, గట్టిగా కళ్లు మూసుకొని నిద్రపోయాడు. శరత్‌ మాత్రం ''ఆ ఆకారం ఏమైయుంటుందా?' అని ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం ఇద్దరూ బడికి బయలుదేరారు. దారిలో రాత్రి తాము చూసిన చెట్టును చూశాడు శరత్‌. అంతే ఒక్కసారిగా విరగబడి నవ్వసాగాడు. శ్రావణ్‌కు అర్థంకాక పైకి చూశాడు. వెంటనే అతనికీ నవ్వాగలేదు. అక్కడ చిరిగిపోయిన ఒక పాతగుడ్డ కొమ్మకు తగులుకుని వేలాడుతోంది. పైకి రెండు పీలికలు, కిందికి ఒకటి, మధ్యలో రెండు రంధ్రాలు. బహుశా ఆ రంధ్రాల్లో నుండి వెన్నెల మెరుస్తూ కనబడి వుంటుంది. చూడ్డానికి అచ్చం మనిషి వేలాడబడి, ఊగుతున్నట్లే వుంది. అప్పటి నుండి ఇక జీవితంలో ఎక్కడైనా 'దెయ్యం' వుందన్న మాట వినబడితే చాలు.. పొట్టచెక్కలయ్యేలా విరగబడి నవ్వడమే వీరి పని.