తేది: 19-10-2025, ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నేను రచించిన "కృతజ్ఞత" కథ ప్రచురితమయ్యింది. . చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆ బడికి కొత్తగా వచ్చిన మాష్టారు సుబ్బారాయుడు. బడిలో టీచర్లంతా పెద్దసారు అంటూ గౌరవిస్తారు . ఆయన రోజూ అన్నం తినేముందు ఒక ముద్ద తీసి ఆకులోనో ,కాగితంలోనో ఉంచేవాడు. వెళ్ళి ఆటస్థలంలో ప్రహరీగోడకు దగ్గరగా ఒకచోట పెట్టడం అలవాటు. ఆ తరువాతే తన భోజనం. టీచర్లకు కొన్ని రోజులు వింతగా అనిపించినా ‘ఏమిటి?’ అని ఎవ్వరికీ అడగాలనిపించలేదు. తరువాత పట్టించుకోవడం మానేశారు. మాష్టారు పెట్టిన అన్నం ముద్ద కోసం కాకులు వచ్చేవి.అలవాటైన కాకులు కొన్నాళ్ళకు సరిగ్గా భోజన సమయానికి అక్కడ వాలేవి. క్రమక్రమంగా మాష్టారు అన్నం పెట్టే సమయానికి రావడం ప్రారంభం ఆయింది. ఆపై కొన్నాళ్ళకు అవి ఆయన వెంట నడుచుకుంటూ వెళ్ళేవి. దగ్గరగా ఉండేవి. ఆయన ఆ అన్నాన్ని అక్కడ పెట్టి చిరునవ్వుతో వెనుదిరిగి చూస్తూ వెళ్ళేవాడు. తృప్తిగా భోజనం చేసేవాడు. ఇదంతా ఆ బడిలోని 3వ తరగతి రాకేష్ నెలరోజులు పైగా గమనిస్తున్నాడు.
‘ఉత్త చేయిని విసిరితేనే కాకులు ఎగ్గిరిపోతయిగా. మరి, సారు దగ్గరేమో? ఎగరిపోవడం లేదేంటి?’ అని, ప్రతిరోజూ ఆశ్చర్యపోసాగాడు. ఆలోచన పెరిగిపోతున్నది. ఇది వరకు బడిలో అన్నం తిన్నాక తోటి పిల్లలతో ఆడుకునేవాడు. ఇప్పుడు ఆటలు మానేసి, ఓ ప్రక్కగా కూర్చుని ఆ విషయమే ఆలోచించసాగాడు. ఒకరోజు, ‘ఆఁ! ఐడియా! నేను కూడా కాకులకు అన్నం పెడితే?!.. ఊఁహు, ఆయన సారు కాబట్టి ఎవ్వరూ ఏమీ అనరు. నేను పెడితే అందరూ చూసి నవ్వుతారేమో? ఎగతాళి చేస్తారేమో? అసలు మనం అలా పెట్టవచ్చో? లేదో?’ ఇలా రోజూ ఏవో సందేహాలు చిన్ని బుఱ్ఱలో నాట్యమాడేవి.
ఒకనాడు ఇలాగే ఆలోచిస్తూ, ‘ఆఁ, ఇంటి దగ్గర తింటే. అమ్మో! సారోళ్ళు బడిలో తినకపోతే ఒప్పుకోరు. ఇంట్లో తిందామంటే, అమ్మ, అయ్య పనికిబోతరు.’ అనుకుంటూ ఉండగా, బెల్ మ్రోగింది. ఆలోచనలు పటాపంచలయ్యాయి. క్లాస్‌లోకి అందరితోపాటు పరిగెత్తిపోయాడు. తరగతి పనులలో నిమగ్నమయ్యాడు. ఆ తరువాత విషయమే గుర్తులేదు. ఆ తరువాతి రోజు మధ్యాహ్నం భోజనం గంట కొట్టారు. రాకేష్ మదిలో వెంటనే ముందుటి రోజు ఆలోచనలు కొనసాగాయి. బడిలో అన్నం తినడం, మాష్టారు`కాకుల దృశ్యాన్ని దూరం నుంచి చూడడం నిత్యకృత్యమైంది.
‘‘ఒరేయ్! రాకేష్, రారా! ఖోఖో ఆడదాం’’ తన క్లాస్మేట్ పిలిచాడు . ‘‘ఆఁహ! నేను రాను పోరా’’ అంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు. పిలిచినవాడు,‘‘వాడు రాడంటరోయ్..’’ అనుకుంటూ వెళ్ళిపోయాడు. రాకేష్ ఆలోచనలు, నిర్లిప్తతలు నిత్యకృత్యమైపోయాయి.
మరో నెల రోజుల తర్వాత ఒకరోజు ఇలాగే నిరుత్సాహంగా కూర్చున్నాడు. ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడు.‘ఆఁ! ఐడియా. నాకు బడిలో అన్నం తినబుద్ధి కావడంలేదు. పొట్టనొప్పి వస్తుందని అమ్మతో చెబితే’ అనుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే అమ్మతో చెప్పాడు. అమ్మ బడిలో సారుతో చెప్పింది. ఇంట్లో వండిపెట్టి పనికి పోతానంది. అనుకున్నట్లే జరగడంతో రాకేష్ ఆనందానికి అవధుల్లేవు.
తరువాతి రోజు తన ఇంట్లో ప్లేట్లో అన్నం పెట్టుకున్నాడు.
ఇంటి ముందు ఉన్న కానుక చెట్టు ఆకు తీసుకున్నాడు. అన్నం ముద్ద పెట్టి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్ళాడు. కాకుల కోసం పైకి చూశాడు. ఎక్కడా ఒక్క కాకి కూడా కనబడడం లేదు. ఆకు అక్కడ పెట్టి కాస్త దూరంగా నిల్చున్నాడు. కాసేపు చూసి నిరాశతోనే అన్నం తిని బడికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి చూస్తే అన్నం ఎండిపోయింది. తరువాతి రోజు కూడా అంతే. రోజూ ఇలా పెడుతూనే తింటున్నాడు. కొన్నాళ్ళు గడిచింది.
ఓరోజు యథావిధిగా రాకేష్ ఆకులో అన్నం పెట్టి వచ్చి తింటున్నాడు. ఇంతలో, ‘కావ్, కావ్’మనే శబ్దం వినపడిరది. గబుక్కున పరిగెత్తుకెళ్ళి చూశాడు. అక్కడో కాకి తను పెట్టిన అన్నం దగ్గరలో ఉంది. కానీ, అటూ, ఇటూ దిక్కులు చూస్తోంది. రాకేష్ ను చూసి చటుక్కున ఎగిరిపోయింది. రాకేష్ బాధ పడ్డాడు. తనను చూసి భయపడిందని అర్థమయింది. పక్కగా దాక్కున్నాడు. కొద్ది సేపటికి మరలా వచ్చిందా కాకి. అది అన్నం తింటుంటే తన మనసు ఎక్కడికో ఎగిరిపోతోంది. ఏదో చెప్పలేని హాయితో ముఖంలో వెలుగు, పెదవులపై చిరునవ్వు. ‘‘హే…య్’’ అంటూ ఎగ్గిరి గంతేసి అటు చూశాడు. అక్కడ కాకి లేదు. ఆనందం ఆవిరయ్యింది. ముఖంలో బాధ వెలిసింది.
తరువాతి రోజు నుండి అన్నం ఆకును అక్కడ పెట్టి వచ్చి చాటుగా చూడసాగాడు. అలాగే రోజూ సంతోషపడిపోతున్నాడు . కొన్నాళ్ళ తరువాత అన్నం ఆకు అక్కడ పెడదామని వెళుతున్నాడు. ఎదురుగా గోడపై కాకి. ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. ఒక్క క్షణం ఆగాడు. మరలా ఎగిరిపోతుందేమో? అని ఆలోచించాడు. నెమ్మదిగా ఒక్క అడుగు ముందుకేశాడు. కాకి కాస్త పక్కకు జంప్ చేసింది. కానీ, ఎగిరిపోలేదు. ‘ఎగిరిపోతుందేమో’ నని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి నెమ్మదిగా కాకి వైపు చూడకుండా అక్కడ పెట్టాడు.
వెనుదిరిగాడు. దూరంగా వచ్చి చూశాడు. అక్కడ కాకి అన్నం తింటూ ఉంది. రాకేష్ కళ్ళలో ఆనందం, పెదవులపై చిరునవ్వు. ముఖంలో వెలుగు. తనకు తెలియకుండా ఆనందాన్ని పంచుకోవడానికి చుట్టూ చూశాడు. మరలా కాకి వైపు చూస్తూ సంతృప్తి పడ్డాడు. మరి కొన్ని రోజులకు బడిలో మాష్టారు అనుభవమే తనకు కూడా నిత్యకృత్యమయింది. ఓరోజు వాళ్ళమ్మ ,‘‘ఇప్పుడు బాగానే ఉంటుంది కదరా?! రేపటినుండి అన్నం బడిలోనే తింటావా? అక్కడ గుడ్డు, సాంబార్, పాయసం లాంటివి పెడతారు కదా. ఇంట్లో ఎక్కువగా పచ్చడి మెతుకులేనాయే!’’ అంది. రాకేష్ మౌనంగా ఉండిపోయాడు. మనసులో ఏమనుకుందో గానీ, తనను ఏమీ అనలేదు. పనికి వెళ్ళిపోయింది.
ఆరోజు బడికి సెలవు ఇచ్చారు. అమ్మా,నాన్నా పొలం పనులకు వెళ్ళారు. రాకేష్‌కు ఇంటి వద్ద ఒక్కడే ఉన్నాడు. బారెడు పొద్దు ఎక్కింది. అంబళ్ల పొద్దు దాటింది. ఏమీ తోచడం లేదు. ఊరి బయట అమ్మ పనిచేసే తమ పొలం వద్దకు బయలు దేరాడు. ఊరి పొలిమేర దాటాడు. చుట్టూ ఎవరూ కనబడడం లేదు. కాస్త భయంగా అనిపించి వెనక్కు వెళదామని అనుకున్నాడు. కానీ, మరలా బిక్కుబిక్కుమంటూ ముందుకే నడిచి వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చాడు.
రాకేష్ నోరును చటుక్కున మూసేసి చంకలోకి ఎత్తుకున్నాడు. వాడికి తోడు మరో ముసుగువాడున్నాడు. ఇద్దరూ కలిసి రాకేష్‌ను గబగబా ఎత్తుకుని పారిపోసాగారు. రాకేష్ కాళ్ళుచేతులు గిలగిలా కొట్టుకుంటున్నాడు. దుండగులు కొద్ది దూరం వెళ్ళగానే, రోడ్డు పక్క చెట్టుపై ఉన్న ఒక కాకి చూసింది. ‘కావు కావు’ మని అరిచి గాల్లోకి ఎగిరింది. దుండగుల వెంట పైన ఎగురుతూ ‘‘కావ్ కావ్’’మంటోంది. వాళ్లు మరో ఇరవై అడుగులు ముందుకు వేశాడు. కాకి అరుస్తూనే ఉంది.
ఇంతలో మరోకాకి వచ్చి ఆ కాకిని అనుసరించింది. ఇలా, వెంటవెంటనే కాకుల సంఖ్య పెరిగి గుంపులా తయారయ్యింది. ఇప్పుడు ఆ కాకులన్నీ ‘కావ్ కావ్’ మంటూ ఆ ముసుగువాళ్ళను పొడవసాగాయి. ఆ ధాటికి తట్టుకోలేక రాకేష్‌ను అక్కడే వదిలి పారిపోయారు. కొంత దూరం వరకు తరిమివేశాయి. అటునుండి అటే కాకులు పక్కకు వెళ్ళిపోసాగాయి. పరిగెత్తుతున్న దుండగులను చూస్తూ రాకేష్ ఆనందంతో చప్పట్టు కొట్టుకుంటూ గెంతులు వేయసాగాడు. కొద్ది క్షణాల్లో వాతావరణం మామూలుగా మారింది. రాకేష్‌లో ఇప్పుడు ఏదో తెలియని ధైర్యం నిండింది. ఎగురుకుంటూ పొలం వైపు అడుగులేశాడు.
