PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Thursday, April 29, 2010

ప్రజాశక్తి దినపత్రిక లో నా కథ

శకునాల గోపయ్య
Share Buzz up! చిన్నారి డెస్కు, ప్రజాశక్తి - మద్దిరాల శ్రీనివాసులు Sat, 17 Apr 2010, IST

శీనయ్య, గోపయ్య బట్టలను వాయిదా పద్ధతిలో అమ్మే వ్యాపారస్తులు. ఇద్దరూ మంచిమిత్రులు. అయితే గోపయ్యకు శకునాల పిచ్చి ఎక్కువ. శీనయ్యకు అలాంటి పట్టింపులు ఏమీలేవు.ఒకసారి ఇద్దరూ కలిసి పట్నం వెళ్లి రకరకాల బట్టలు కొని తెచ్చుకున్నారు. పల్లెలన్నీ తిరిగి వాయిదాలలో సొమ్ము చెల్లించే విధంగా బట్టలను అమ్ముకుని వచ్చారు. మరో వారంరోజులకు మిత్రులిద్దరూ మరలా వ్యాపారానికీ, బాకీ వసూళ్లకి బయలుదేరబోయారు. ఇంతలో ఎవరో ఠపీమని తుమ్మారు. వెంటనే గోపయ్య, ఛీ! ఛీ! అనుకుంటూ, 'శీనయ్యా! ఎవరో తుమ్మారు, శకునం బాగా లేదు, కాసేపు ఆగిపోదాములే! వుండు' అన్నాడు.స్నేహితుని మాట కాదంటే బాధపడతాడని కాసేపు ఆగి ఒకచోట కూర్చున్నారిద్దరూ. కొంచెం సేపయ్యాక మరలా ఇద్దరూ బయలుదేరబోయారు. కొంతదూరం పోయారో లేదో ఒక వితంతువు ఎదురు వచ్చింది. వెంటనే గోపయ్య. 'శివ! శివా!' అనుకుంటూ, 'ఒరే! శీనయ్యా! ఇవాళ శకునం బాగాలేదు గానీ, వ్యాపారానికి రేపు వెళదాం లే!' అన్నాడు. 'ఒరే! గోపయ్యా! నీకెన్నిసార్లు చెప్పాను. ఇలాంటివన్నీ పట్టించుకోవద్దనీ, ఇవి మన వ్యాపారానికి మంచిది కాదనీ, పద! బయలుదేరుదాం' అన్నాడు.కానీ, గోపయ్య వినిపించుకోకుండా, 'నీకూ నేను చాలాసార్లు చెప్పాను. ఇలాంటి శకునాలు మంచివి కావనీ. అయినా నీ కర్మ!' అంటూ వెనుదిరిగాడు. శీనయ్య మాత్రం అనుకున్న ప్రకారం వ్యాపారానికి బయలుదేరాడు. సాయంకాలానికల్లా తన బట్టలన్నీ చక్కగా అమ్ముకోవడంతోపాటు, గత వాయిదాల సొమ్ము కూడా చాలావరకూ వసూలు చేసుకుని మరీ వచ్చాడు.

తదుపరి వారం ఇద్దరూ కలిసి వ్యాపారానికి బయలుదేరి పోతుండగా ఈసారి దారిలో ఒక పిల్లి ఎదురైందని 'ఇదేం ఖర్మరా బాబూ!' అనుకుంటూ, 'ఒరే! శీనయ్యా! ఈసారైనా నా మాట వినరా! పిల్లి ఎదురవడం అస్సలు మంచిది కాదు. ఈరోజుటికి ఆగి పోదాం, పద' అన్నాడు.

'గోపయ్యా! ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. పోయినవారం ఇలాగే నీవు వెనుదిరిగావు. ఏమైంది? నేనేమో, బాకీలు తెచ్చుకున్నాను, బట్టలన్నీ అమ్ముకున్నాను. నా మాట విని పద! వ్యాపారానికెళ్దాం' అంటూ స్నేహితునికి హితం చెప్పబోయాడు శీనయ్య.

కానీ, గోపయ్య.. 'ఒరే! శీనయ్యా! ఏదో ఒకసారికి నీకు మంచి జరిగి వుండొచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. దెబ్బతింటావు జాగ్రత్త! పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు పెద్దలు. కాబట్టి ఈసారైనా నా మాట విని వెనుదిరుగు' అంటూ కాస్త కోపం కూడా ప్రదర్శించాడు.

ఇక లాభం లేదనుకుని శీనయ్య తన వ్యాపారానికి బయలుదేరాడు. 'పోరా! పో! అనుభవిస్తావు', అనుకుంటూ ఇంటికి వెళ్లాడు గోపయ్య.

ఇలా అప్పుడప్పుడూ శకునాలతో వెనుదిరగడం గోపయ్యకు పరిపాటి అయ్యిందేగానీ తన పద్ధతిని మాత్రం మార్చుకోలేదు. దానితో బాకీలు సకాలంలో వసూలుగాక, అప్పులతో వ్యాపారం చేయాల్సి వచ్చేది. చివరకు దివాళా తీశాడు. మూఢనమ్మకాలు లేని శీనయ్య మాత్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా తన వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవించసాగాడు.

Sunday, April 18, 2010

మీరు కోరుకున్న గేయాన్ని ఎలా వినాలా ? అని అనుకుంటున్నారా ?

ఇందులోని గేయాలను వినాలంటే ముందుగా మీరు వినాలనుకున్న గేయానికి క్రింద వున్న http// లింకు పై క్లిక్ చేయండి. అపుడు వచ్చే రెండు స్పీడోమీటర్ లలో free user అనే దానిపై క్లిక్ చేయండి. అపుడు download అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే open with file , save file అనే రెండు options వస్తాయి. అందులో save file పై క్లిక్ చేసి మీరు కోరుకున్న గేయాన్నిdownload చేసుకొని వినవచ్చును.