8.బాలప్రభ కథ – వెలుగు కిరణాలు
మూడవ తరగతి చదువుతున్న విజయ్ చాలా తెలివైన వాడు, చురుకైనవాడు. కాకపోతే ‘తండ్రి తాగుడే’ అతని బాల్య జీవితంలో ఏకైక శత్రువు.
తండ్రి రాజన్న రోజు కూలీ. డబ్బు బాగా సంపాదిస్తాడు. కానీ, మద్యానికి బానిస. తాగి వచ్చి నిష్కారణంగా భార్యను తిట్టడం, కొట్టడం ఇంట్లో నిత్యకృత్యం.
భార్య సీతమ్మ వ్యవసాయ కూలీ. తన సంపాదనతోనే ఇల్లు నెట్టుకొచ్చేది. విజయ్ తో పాటు మరో ఆడపిల్ల కూడా ఉంది. బిడ్డల కోసం భర్తను భరించక తప్పడం లేదు. ‘ఆవు చేలో మేస్తే దూడ గెట్టున మేస్తుందా?’ అన్న చందాన పరిస్ఠితి ఉన్నది.
చిన్న వయసులోనే విజయ్ ని కోపం, తిట్లు ఆవరించాయి. వాటిని ఇంటా, బయటా తోటి పిల్లలపై ప్రయోగించేవాడు. నిష్కారణ గొడవలకు దిగేవాడు. బడిలోనూ అంతే. బాధితులైన పిల్లల ఫిర్యాదులతో, టీచర్లు, తల్లిదండ్రులతో రోజూ దేహశుద్ధి జరిగేది.
ఎంత మందితో ఎన్ని తన్నులు తిన్నా సిగ్గూశరం లేదు. క్రమేణా శిక్షలకు అలవాటై రాటు దేలాడు. చేసేది లేక ఊరంతా విజయ్ ని ‘‘రౌడీ వెధవ’’ గా ముద్ర వేశారు. ‘దుష్టులకు దూరంగా ఉండమన్నారు కదా!’ పెద్దలు. అందుకే, వాడికి దూరంగా ఉండమని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పేవారు.
రెండేళ్ళు గడిచింది. ఇప్పుడు ఐదవ తరగతికి వచ్చాడు. బడి ప్రారంభంలోనే ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయ్యారు. బదులుగా శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు వచ్చాడు. ఎక్కడ పనిచేసినా అతనివి నాలుగే సూత్రాలు.
తాను చెప్పేది పిల్లలు వినేలా చేసుకోవడం.
వారిచే మాట్లాడింపజేయడం.
ఏ తెలుగు పుస్తకాన్ని ఎవరు ఇచ్చినా చూసి పిల్లలే చదవగలిగే టెక్నిక్స్ నేర్పడం.
మంచి దస్తూరితో వ్రాత నేర్పించడం.
ఈ క్రమంలో పిల్లలను తిట్టడు, కొట్టడు కూడా. పైగా కొత్త కొత్త విధానాలతో బోధన చేసేవాడు. పిల్లల్లో మంచి విలువలు నింప గల ఉత్తమ ఉపాధ్యాయుడు. నిత్యవిద్యార్థి. విద్యార్థులను మంచి బాట వైపు తీర్చి దిద్దగల నేర్పరి. ఆ సంవత్సరం శ్రీధర్ ని 4,5 తరగతులకు కేటాయించారు. మొదటి రోజు పిల్లలను పరిచయం చేసుకున్నాడు. గలగల శబ్దంలోనే సాగింది పరిచయం.
కథలు, కబుర్లు చెప్పాడు. పాటలు పాడాడు. పిల్లలకు కొత్తగా, ఆకర్షణీయంగా అనిపించింది. తరగతి గది కాస్త సద్దుమణిగింది. తన మాటలు/పాటలు ఆపగానే షరా మామూలైంది. సాయంత్రం కొత్త కొత్త ఆటలు కూడా ఆడిస్తూ, పిల్లల్లో మమేకం అవుతున్నాడు. మూడు రోజులు గడిచాయి. సారుపై అభిమానం మొలకలెత్తుతున్నది. తరగతిలో గోల కాస్త తగ్గుముఖం పట్టింది. కాస్త వినడానికి అలవాటు పడుతున్నారు. అడిగిన దానికి జవాబిస్తున్నారు. విజయ్ తో పాటు ఒక్కొక్కరి మనస్తత్వం కూడా తెలుస్తున్నది. చెస్, క్యారంబోర్డు, బ్రెయిన్విటా, జెంగా గేమ్ లాంటివి కొని తెస్తున్నాడు. వాటన్నిటినీ నేర్పిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నాడు.
రెండు వారాల తరువాత శ్రీధర్ ఓ నోటుబుక్ తెచ్చాడు. పిల్లలకు చూపిస్తూ, ‘‘చూడండి పిల్లలూ! ఈ నోట్బుక్ నా డైరీ అన్నమాట. మీరు చేసే మంచి పనులకూ, సమాధానాలకూ పాయింట్స్ ఇస్తాను. అవి ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, 5, 10 కూడా ఇవ్వవచ్చు. మీరు చేసే పనిని బట్టి, మీ సమాధానాలను బట్టీ. వాటిని మీ పేరుతో డైరీలో వ్రాసుకుంటా. 50 పూర్తి కాగానే ఒక గిఫ్ట్, చూద్దాం ఎవరో ఫస్ట్. తరువాత 100 కు, 150 కి, ఇలా ఇస్తూనే ఉంటాను.’’ అన్నాడు. పిల్లలలంతా,‘‘హై, భలే భలే!’’ అంటూ సంబర పడ్డారు, విజయ్ తప్ప.
రోజూ సారు పాయింట్స్ వ్రాస్తున్నపుడు పిల్లలను దగ్గరికి పిలిచేవాడు. డైరీలో వారి పేరు గుండ్రంగా, అందంగా వ్రాస్తుంటే ,‘అబ్భ’ అంటూ పిల్లల కళ్ళల్లో మెరుపు వచ్చేది. విజయ్ మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక్కొక్కరికీ పాయింట్స్ వస్తున్నాయి.
‘‘ఆఁ..రాజు కరెక్టుగా చెప్పాడు. కాబట్టి, ఒక పాయింట్, చప్పట్లు కొట్టండీ’’,
‘‘రాధిక, చక్కగా 5 ఎక్కాలు చెప్పింది. సో, ఫైవ్ పాయింట్స్, కమాన్, చప్పట్లు కొట్టండీ’’
ఇలా అంటుంటే పిల్లల్లో ఉత్సాహం పెరిగి పోయేది. ఒక నెల తిరిగే సరికి, పిల్లలందరిలో వారికి తెలియకుండానే మార్పు వచ్చింది. కాస్త విజయ్ లో కూడా. ఫిర్యాదుల ఊసే లేదు. ఓరోజు సారు వరుసగా 5మంది విద్యార్థులకు పాయింట్స్ రాస్తున్నాడు. పిల్లలంతా చేరి చప్పట్లు మ్రోగిస్తున్నారు. ఈ సంఘటన విజయ్ మనసులో ప్రకంపనలు రేపింది.
ఉన్నట్లుండి ఓ రోజు విజయ్ లేచి,‘‘సార్, మీరు పాడిన ఆ పద్యం నేను పాడమంటారా?’’ అన్నాడు.
‘‘ఊ..పాడు’’ అనగానే అద్భుతంగా రాగయుక్తంగా పాడాడు.
వెంటనే ఉత్సాహంతో సారు,‘‘ వెరీ గుడ్. ఫైవ్ పాయింట్స్’’ అన్నాడు. ఊహించని ఈ పరిణామంతో విజయ్ పెదవులపై తెలియకుండా చిరునవ్వు మొలిచింది. తరగతి పిల్లల అందరి వైపు చూస్తూ ముఖంలో వెలుగులు నింపుకున్నాడు. తరగతి వాతావరణం మారిపోయింది. చప్పట్ల వర్షం కురిసింది. విజయ్ లో నిద్రాణమై ఉన్న ఉత్సాహ బీజం మొలకలేసింది. ఆ రోజుటి నుండి అన్ని కార్యక్రమాలపై విజయ్ కి ఆసక్తి పెరిగింది. పిల్లలతో కలిసి పోయాడు. మూడు నెలల పరీక్షలో మంచి మార్కులు కూడా సాధించాడు. 50 పాయింట్లకు గిఫ్ట్ తెచ్చుకున్న పది మందిలో విజయ్ కూడా ఒకడైనాడు.
ఇప్పుడు సారు విజయ్ కి చిన్న చిన్న పనులు కూడా అప్పగిస్తున్నారు. ‘‘బోర్డు తుడిచేయ్ విజయ్ ’’, ‘‘ఈ పద్యం నువ్వైతే చాలా బాగా పాడతావు విజయ్’’ “ఇప్పుడు మన విజయ్ మీకు గేయానికి అభినయం చూపిస్తాడు” ఇలా మిగిలిన విద్యార్థులతో పాటు అతనిలో నమ్మకం నాటారు. తరువాత స్కూల్ నాటికలో కథకుడిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో కూడా తండ్రి వచ్చే లోపు నిద్ర పోతున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగింది.
-౦-
ఆరోజు పాఠశాల వార్షికోత్సవం. తల్లిదండ్రులందరూ హాజరయ్యారు. పనులు కూడా మానేసిన రాజన్న తాగిన మత్తులోనే కార్యక్రమానికి హాజరయ్యాడు. నాటికలో కథకుడుగా విజయ్ ది మద్యం బానిసలకు బుద్ధి చెప్పే పాత్ర. ‘పెద్దల తప్పుల వలన పిల్లల జీవితాలు ఎలా చీకటి పాలవుతున్నాయో?’చెప్పడం. పాత్రలో విజయ్ లీనమైపోయి అద్భుతంగా జీవించాడు. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాడు. మత్తులో ఉన్న రాజన్నను కొడుకు వేషం, కళ్ళు విప్పార్ఛేలా చేసింది. అతనికి తెలియకుండానే కొడుకు వేషం చూడడానికి శరీరాన్ని నిటారుగా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చాలావరకు సఫలమయ్యాడు.
స్జేజీపై కొడుకును చూసి ముగ్ధుడైనాడు. డైలాగ్స్ వినడానికి చెవులు రిక్కించాడు. విజయ్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. ప్రేక్షకుల చప్పట్లు రాజన్న మత్తును తునాతునకలు చేస్తున్నాయి. నాటిక ముగియగానే, చప్పట్లు, కేరింతలు, ఈలలతో ఆ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీధర్ సార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ కౌగిలించుకున్నాడు. సారు భుజం తట్టి ఓదర్చాడు. కార్యక్రమం ముగిసింది. రాజన్న మనసులో తప్పు చేశానన్న భావనకు బీజం పడింది. తరువాతి రోజు తాగి ఇంటికి వచ్చినా, గొడవ చేయలేదు.
ఆ బీజం మొలకలెత్తసాగింది. భార్యాబిడ్డలపై ప్రేమ, జాలి పెరగసాగాయి. ఈ మధ్య ఒక్కో రోజు అస్సలు తాగకుండా ఇంటికి వస్తున్నాడు. భార్య ఆశ్చర్యంతో నోరు తెరిచింది. కానీ, ఏమీ మాట్లాడకుండా తనలో తాను తెగ మురిసిపోయింది. కానీ, తన ఆశ్చర్యానికి సమాధానం దొరకలేదు. అనుకోకుండా ఒకరోజు రాజన్న ప్రమాదంలో గాయపడ్డాడు. హాస్పిటల్లో చేర్పించారు.
చికిత్స చేశాక బెడ్ పై పడుకోబెట్టారు. విజయ్, తండ్రి దగ్గరికి వెళ్ళి ,‘‘నాన్నా, నేను మారిపోయాను. నువ్వూ మారవచ్చు కదా!’’ అడిగాడు. ‘‘ మారి పోతానురా, కన్నా! మారిపోతా’’ నంటూ, భార్యా బిడ్డలను దగ్గరికి తీసుకున్నాడు. భోరుమని ఏడుస్తూ, కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంటికి చేరాక అతి తక్కువ కాలంలోనే మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ స్కూల్ లో ‘‘ఉత్తమ ప్రవర్తన గల విద్యార్థి’’గా గుర్తింపు పొందాడు. రాజన్నలో నూతన తేజం వచ్చింది. ఉపాధి పనుల్లో తిరిగి స్థిరపడ్డాడు. ఈ మార్పుకు మూలం ఒక్కటే. ఒక మంచి ఉపాధ్యాయుడు, ప్రేమతో చూపిన మార్గం.
ఓ మంచి ఉపాధ్యాయుడి ఆదర్శ బోధన ఒక విద్యార్థి జీవితానికి వెలుగు కిరణమైంది.
ఓ నాటికలోని పాత్ర మద్యం బానిసను తట్టిలేపిన ఇంకో వెలుగు కిరణం అయ్యింది.
ఓ వ్యక్తిలో వచ్చిన మార్పు అతని కుటుంబానికి మరో వెలుగు కిరణంగా మారింది.
ఇలా, కంటికి కనబడని ‘‘వెలుగు కిరణాలు’’ ఎన్నో?!
